Telugu Global
Andhra Pradesh

ప‌నులు జెట్ స్పీడుతో జరుగుతున్నాయా..?

మొన్ననే అంటే వారం క్రితమే హైకోర్టు ఇళ్ల పట్టాల పంపిణీకి అనుమతిచ్చింది. అప్పటినుండి పనులన్నీ జెట్ స్పీడుగా జరిగిపోతున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా ఏదోరూపంలో కోర్టులో కేసులు వేయచ్చని ప్రభుత్వం అనుమానించింది.

ప‌నులు జెట్ స్పీడుతో జరుగుతున్నాయా..?
X

జెట్ స్పీడంటారు కదా నిజంగా అలాగే జరుగుతున్నాయి పనులు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాల పంపిణీకి సంబంధించిన పనులు చాలా స్పీడుగా జరుగుతున్నాయి. పనులు పూర్తిచేసి పేదలకు పట్టాల పంపిణీ చేయటానికి ఈనెల 15వ తేదీని ప్రభుత్వం డెడ్ లైనుగా పెట్టుకున్నది. దానికి అనుగుణంగానే 1,134 ఎకరాలను చదునుచేయటం, ఇళ్ళస్థ‌లాలను కొలిచి హద్దులు ఏర్పాటుచేయటం, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ‌ ఏర్పాటుకు మార్కింగులు చేసి పనులు మొదలుపెట్టేశారు.

మామూలుగా ఒకదాని తర్వాత మరోపని తీసుకుంటుంది ప్రభుత్వం. కానీ, ఇక్కడ మాత్ర అవసరం దృష్ట్యా అన్నీ పనులను ఏకకాలంలో చేసేస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు పట్టాల అంశం దాదాపు రెండేళ్ళు కోర్టులోనే నలిగింది. చివరకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు రైతుల ముసుగులో రియాల్టర్లు, టీడీపీ నేతలు హైకోర్టు, సుప్రీంకోర్టులో మళ్ళీ హైకోర్టులో కేసులు వేసినా ఉపయోగం కనబడలేదు. కాలయాపన జరిగిందే కానీ ప్రభుత్వ లక్ష్యాన్ని అడ్డుకోలేకపోయారు.

మొన్ననే అంటే వారం క్రితమే హైకోర్టు ఇళ్ల పట్టాల పంపిణీకి అనుమతిచ్చింది. అప్పటినుండి పనులన్నీ జెట్ స్పీడుగా జరిగిపోతున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా ఏదోరూపంలో కోర్టులో కేసులు వేయచ్చని ప్రభుత్వం అనుమానించింది. అందుకనే నిడమర్రు, కురగల్లు, కృష్ణాయపాలెం, ఐనవోలు, మందడం గ్రామాల్లో 49 వేలమంది పేదలకు ఇళ్ళస్థ‌లాల పంపిణీకి అధికారులు రెడీ చేశారు. లబ్దిదారులను గుర్తించి, వాళ్ళపేర్లతో పట్టాలను ప్రింట్ చేయటం కూడా అయిపోయింది.

భారీ ఎత్తున కార్యక్రమం పెట్టుకుని 15వ తేదీన జగన్ లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేయబోతున్నారు. తమ భూముల్లో పేదలకు పట్టాలపంపిణీ చేయకూడదన్నది అమరావతి రైతుల వాదన. తమ పక్కన పేదలకు చోటులేదన్నట్లుగా పిటీషనర్లు మాట్లాడుతున్నారు. దీన్ని కోర్టులు తప్పుపట్టాయి. అయితే వాళ్ళ ఆలోచనలో ఎలాంటి మార్పురాలేదు. ప్రభుత్వం అనుమానించినట్లుగానే రైతుల ముసుగులో కొందరు మళ్ళీ సుప్రీంకోర్టులో కేసువేశారు. అందుకనే ప్రభుత్వం పట్టాలపంపిణీకి ఆగమేఘాల మీద పనులు పూర్తిచేసేస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొందరు పేదలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ళపట్టాలిచ్చి అక్కడ జగనన్న కాలనీలను ఏర్పాటుచేయబోతున్నారు. చూద్దాం చివరకు ఏమవుతుందో.

First Published:  9 May 2023 5:32 AM GMT
Next Story