Telugu Global
Andhra Pradesh

జనసేన నేతలపై తిరగబడ్డ మహిళలు

జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల స్థలాలు మీకు కనిపించడం లేదా..? అని విరుచుకుపడ్డారు. తప్పుడు ప్రచారం చేసి మర్యాద పోగొట్టుకోవద్దని సూచించారు.

జనసేన నేతలపై తిరగబడ్డ మహిళలు
X

పెడనలో జనసేన నేతలపై మహిళలు తిరగబడ్డారు. జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలపై సోషల్ అడిట్‌ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు జగన్ ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అక్కడికి వెళ్లి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా కృష్ణా జిల్లా పెడనలో జగనన్న కాలనీల వద్దకు జనసేన నాయకులు వెళ్లారు. లబ్దిదారుల్లోని కొందరు మహిళలు వచ్చి వారితో వాగ్వాదానికి దిగారు. తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటూ జ‌న‌సేన నేత‌ల‌ను నిలదీశారు.

జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల స్థలాలు మీకు కనిపించడం లేదా..? అని విరుచుకుపడ్డారు. తప్పుడు ప్రచారం చేసి మర్యాద పోగొట్టుకోవద్దని సూచించారు. ఇచ్చిన ఇళ్ల స్థలాలు కనిపిస్తున్నా.. నిర్మాణంలో ఉన్న ఇళ్లూ కనిపిస్తున్నా.. ఇంకా ఎందుకు సీఎంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అక్కడే పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు కూడా మహిళలకు తోడుగా వచ్చారు. జనసేన నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో భవన నిర్మాణ కార్మికులపై జనసేన నేతలు దాడికి ప్రయత్నించగా... పరస్పరం తోపులాట జరిగింది. లబ్దిదారులైన మహిళలు తీవ్రస్థాయిలోప్రతిఘటించడంతో జనసేన నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Next Story