Telugu Global
Andhra Pradesh

కొమ్మినేనికి, విలేకర్లకు మధ్య సంవాదం

స్పందించిన కొమ్మినేని శ్రీనివాస్..''అసలు మిమ్మల్ని నేను పిలవలేదు.. ఎందుకొచ్చారు?'' అని ప్రశ్నించారు. తామేమీ పనిలేక ఇక్కడికి రాలేదని.. మీ కార్యక్రమాన్ని కవర్ చేయాల్సిందిగా ఐ అండ్ పీఆర్‌ నుంచే ఆహ్వానం వచ్చిందని విలేకర్లు వివరించారు.

కొమ్మినేనికి, విలేకర్లకు మధ్య సంవాదం
X

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్‌రావుకు కొందరు విలేకర్లకు మధ్య సంవాదం జరిగింది. ఇటీవల కందుకూరులో చంద్రబాబు రోడ్‌ షో జరిగి 8 మంది చనిపోయిన ప్రాంతాన్ని కొమ్మినేని శ్రీనివాస్ పరిశీలించారు. ఆయనకు పోలీసులు రక్షణ కల్పించారు. అక్కడి పరిసరాలను పరిశీలించిన తర్వాత కొమ్మినేని శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు.

కందుకూరు, గుంటూరు దుర్ఘటనలకు పోలీసులు, ప్రభుత్వమే కారణమని టీడీపీ ఆరోపిస్తోందని.. రాజకీయ పార్టీలే అనుకుంటే పత్రికలు కూడా అలాగే రాస్తున్నాయని కొమ్మినేని విమర్శించారు. వస్తువులు పంపిణీ చేస్తామంటూ పేదలను రప్పించి ప్రాణాలు తీస్తే అందుకు పోలీసులు ఎలా బాధ్యులవుతారని కొమ్మినేని ప్రశ్నించారు. దాంతో విలేకర్లు మీరు ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా ఇక్కడి వచ్చారా..? లేక రాజకీయ పార్టీ తరపున వచ్చారా అని ప్రశ్నించారు.

వస్తువుల పంపిణీ కార్యక్రమం రహస్యంగా జరగలేదు కదా.. పోలీసుల అనుమతితోనే చేశారు.. అలాంటప్పుడు అవాంఛ‌నీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి కదా..? అని ప్రశ్నించారు. దాంతో పంపిణీకి నిర్వాహకులు అనుమతి తీసుకున్నారా..? అని కొమ్మినేని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో సీనియర్‌ జర్నలిస్ట్‌, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అయిన మీకు ఆ విషయాలు కూడా తెలియవా..? ఆ మాత్రం తెలుసుకోకుండానే ఇక్కడికి వచ్చారా..? అని విలేకర్లు ప్రశ్నించారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్ అయిన మీరు ఇలా ఒక రాజకీయ పక్షం తీసుకుని మాట్లాడటం సరైనదేగా అని నిలదీశారు.

అందుకు స్పందించిన కొమ్మినేని శ్రీనివాస్..''అసలు మిమ్మల్ని నేను పిలవలేదు.. ఎందుకొచ్చారు?'' అని ప్రశ్నించారు. తామేమీ పనిలేక ఇక్కడికి రాలేదని.. మీ కార్యక్రమాన్ని కవర్ చేయాల్సిందిగా ఐ అండ్ పీఆర్‌ నుంచే ఆహ్వానం వచ్చిందని విలేకర్లు వివరించారు. ప్రభుత్వం తరఫున ఎందుకు మాట్లాడుతున్నారని విలేకర్లు ప్రశ్నించగా.. తనను ప్రభుత్వమే నియమించిందన్న విషయాన్ని కొమ్మినేని గుర్తు చేశారు. తాను ఇలా మాట్లాడటంలో తప్పు లేదన్నారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా జర్నలిస్టులకు ఏం చేశారు..? ఏం చేస్తారు..? కనీసం అక్రిడేషన్లు అయినా ఇప్పించగలరా..? అంటూ అని విలేకర్లు ప్రశ్నించారు. దాంతో కొమ్మినేని శ్రీనివాస్‌ ఇవన్నీ చేయడం ''నాకు చేతకాదులే'' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

First Published:  7 Jan 2023 2:19 AM GMT
Next Story