Telugu Global
Andhra Pradesh

నిర్లక్ష్యపు నీడలో పలనాటి వారసత్వం!

పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, జిట్టగామాలపాడు గ్రామ శివారులోని నాయకురాలు నాగమ్మ దేవాలయమని స్థానికులు గట్టిగా నమ్ముతున్న శిథిలాలను పరిశీలించారు.

నిర్లక్ష్యపు నీడలో పలనాటి వారసత్వం!
X

పల్నాటి వీర భారత వారసత్వం, అలనాటి పౌరుషానికి ప్రతీకలైన చారిత్రక శకలాల్ని పదిలపరుచుకోవాలని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్ట‌ర్‌ ఈమని శివనాగిరెడ్డి పల్నాడు ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. వారసత్వ సంపదను కాపాడి భవిష్యత్ తరాలకు అందించే 'ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటి' అనే అవగాహన కార్యక్రమంలో భాగంగా, ఆయన ఆదివారం నాడు పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, జిట్టగామాలపాడు గ్రామ శివారులోని నాయకురాలు నాగమ్మ దేవాలయమని స్థానికులు గట్టిగా నమ్ముతున్న శిథిలాలను పరిశీలించారు. పల్నాటి యుద్ధంలో, నలగామ రాజు మంత్రిగా, మలిదేవరాజు మంత్రి బ్రహ్మనాయునితో పోరాడిన వీర వనితగా గుర్తింపు పొందిన నాయకురాలు నాగమ్మ, ఆమె తండ్రి చౌదరి రామిరెడ్డి నివసించారని విశ్వసిస్తున్న ప్రదేశంతో పాటు, జిట్టగామాలపాడు లో ఆమె నిర్మించిన చెన్నమల్లికార్జునాలయాన్ని, ఇంకా, ఆమె పౌరుషానికి గుర్తుగా అప్పటి వీరులు నిర్మించిన నాగమ్మ దేవాలయ శిధిలాలను అధ్యయనం చేసి, ఆసక్తికర విషయాలను వెల్లడించారు.


మధ్యయుగాల్లో శ్రీనాథుడు, ఈ తరంలో గుర్రం చెన్నారెడ్డి, కే.హెచ్.వై. మోహన్ రావు రచనల నేపథ్యంలో ఈ శిథిలాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయన్నారు. నాగమ్మ నిర్మించిన చెన్న మల్లికార్జునాలయాన్ని అప్పటి ప్రజాపతినిధుల చొరవతో పదేళ్ల క్రితం ప్రభుత్వం పునరుద్ధరించిందని, ఆ ఆలయానికి దక్షిణాభిముఖంగా గర్భాలయ, అర్ధ, మహా మండపాలతో ఉన్న నాగమ్మ ఆలయం, అధిష్టానం వరకు కూలిపోయి, చల్లాచెదురుగా పడి ఉన్న ఆలయ శకలాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

నాగమ్మ ఆలయ పునరుద్ధరణకు స్థానికులు ముందుకొస్తే, స్థపతిగా అనుభవమున్న తాను, ఉచితంగా సాంకేతిక సహాయాన్ని అందిస్తానన్నారు. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత గల నాయకురాలు నాగమ్మ దేవాలయాన్ని పదిలపరిచి, పల్నాటి యుద్ధ క్షేత్రాలైన మాచర్ల, గురజాల, కారంపూడి, కంభంపాడులను జిట్టగామలపాడుతో కలుపుతూ పల్నాడు టూరిస్ట్ సర్యూట్ ను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

First Published:  18 Feb 2024 5:50 AM GMT
Next Story