Telugu Global
Andhra Pradesh

ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీపై కేసు.. ఏపీ కానిస్టేబుల్ సస్పెన్షన్లో ట్విస్ట్..

తాను దళితుడిని కాబట్టి, కుట్రపన్ని డిస్మిస్‌ చేశారంటూ అనంతపురం టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు భానుప్రకాష్. బాధ్యులైనవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. స్థానిక ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అనంతపురం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీపై కేసు.. ఏపీ కానిస్టేబుల్ సస్పెన్షన్లో ట్విస్ట్..
X

సీఎం జగన్ పర్యటన సందర్భంగా ప్లకార్డులు పట్టుకుని కలకలం సృష్టించిన ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాష్‌ని, ఇటీవల వేరే కారణంతో డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి భానుప్రకాష్ పోలీసులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తన పైఅధికారులేమైనా పత్తిత్తులా అని ప్రశ్నించారు. అందరిపై కేసులున్నాయని, అందరి సంగతి తేల్చాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తనపై కక్షసాధింపులకు పాల్పడ్డారంటూ జిల్లా ఎస్పీ ఫకీరప్ప, అడిషనల్ ఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్ బాషాలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిపై పోలీస్ కేసు నమోదు కావడం ఈ కేసులో పెద్ద ట్విస్ట్.

తాను ఎస్సీని కాబట్టే తనను బలిపశువుని చేశారంటున్నారు భానుప్రకాష్. తన సస్పెన్షన్ కి కారణం అంటున్న కేసులో బాధితురాలిని సైతం మీడియా ముందుకు తీసుకొచ్చి వివరణ ఇప్పించారు. దీంతో పోలీసుల వాదనలో పసలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానిస్టేబుల్‌ భానుప్రకాష్‌ పై ఇప్పటివరకు 5 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని అంటున్నారు. 2019 లో గార్లదిన్నె పోలీస్‌ స్టేషన్‌ లో తనపై నమోదైన ఓ కేసు విచారణ కోర్టులో ఉండగానే, పోలీసు శాఖ విచారణ చేపట్టిందని, ఇది చట్టాన్ని ఉల్లంఘించడమేనంటున్నారు భాను ప్రకాష్. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చేసి నేరం రుజువైందంటూ తనను ఉద్యోగంలో నుంచి డిస్మిస్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తాను దళితుడిని కాబట్టి, కుట్రపన్ని డిస్మిస్‌ చేశారంటూ అనంతపురం టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు భానుప్రకాష్. బాధ్యులైనవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. స్థానిక ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అనంతపురం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆయనతో పాటు ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్ బాషాలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీపై నమోదైన కేసుపై డీఐజీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని తెలిపారు. ఇతర జిల్లాలకు చెందిన ఉన్నతాధికారితో విచారణ జరిపించేందుకు డీఐజీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఏఆర్ కానిస్టేబుల్ సస్పెన్షన్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

First Published:  1 Sep 2022 2:37 AM GMT
Next Story