Telugu Global
Andhra Pradesh

ఏపీ గ్రూప్ -1 మెయిన్స్ రద్దు.. హైకోర్టు కీలక తీర్పు

తాజా గ్రూప్-1 నోటిఫికేషన్ కోసం ఈనెల 17న ప్రిలిమ్స్ పరీక్ష జరగాల్సి ఉంది. ఈలోగా గత నోటిఫికేషన్ లో మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ కోర్టు తీర్పునివ్వడం విశేషం.

ఏపీ గ్రూప్ -1 మెయిన్స్ రద్దు.. హైకోర్టు కీలక తీర్పు
X

2018లో APPSC నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్ ఎగ్జామ్ పై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది. మెయిన్స్‌ జవాబు పత్రాలను రెండుసార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఎంపిక ప్రక్రియను 6 వారాల లోపు పూర్తిచేయాలని స్పష్టం చేసింది.

ఎందుకీ రద్దు..

గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలను మాన్యువల్‌ గా (చేతితో దిద్దడం) రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మొదటిసారి జరిగిన మూల్యాంకనాన్ని తొక్కిపెట్టి, రెండోసారి తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకోడానికే ఇలా దిద్దించారని వారు పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈరోజు తీర్పు వెల్లడించింది. 2018 నోటిఫికేషన్ కి సంబంధించి గ్రూప్-1 మెయిన్స్ ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

ఈనెల 17 జరిగే పరీక్ష సంగతేంటి..?

తాజా గ్రూప్-1 నోటిఫికేషన్ కోసం ఈనెల 17న ప్రిలిమ్స్ పరీక్ష జరగాల్సి ఉంది. ఈలోగా గత నోటిఫికేషన్ లో మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ కోర్టు తీర్పునివ్వడం విశేషం. దీంతో తాజా నోటిఫికేషన్ ను కూడా జతచేసి ఒకేసారి పరీక్షలు నిర్వహిస్తారా, లేక గత నోటిఫికేషన్ కు విడిగా పరీక్ష నిర్వహిస్తారా అనేది తేలాల్సి ఉంది. కోర్టు తీర్పు ప్రకారం 6 వారాల లోగా 2018 నోటిఫికేషన్ కి సంబంధించి ఎంపిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. రెండు నోటిఫికేషన్లను జత చేయాలని APPSC భావిస్తే ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చి అనుమతి పొందాల్సి ఉంటుంది.

అభ్యర్థుల్లో గందరగోళం..

రాష్ట్ర విభజన తర్వాత APPSC, TSPSC ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదమవుతోంది. తెలంగాణలో పేపర్ లీకేజీ కారణంగా TSPSC తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంది. నిరుద్యోగుల కోపం ప్రభావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. ఇటు ఏపీలో నియామక ప్రక్రియను కోర్టు నిలిపివేయడం విశేషం. ఈ దశలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రతిపక్షాలు ఈ వ్యవహారాన్ని తమకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది.

First Published:  13 March 2024 7:08 AM GMT
Next Story