Telugu Global
Andhra Pradesh

వైనాట్ 175.. ఏపీలో బీఆర్ఎస్ తరపున పోటీ గ్యారెంటీ

ఈ ఊపు చూస్తుంటే ఏపీలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడం ఖాయమని తేలిపోతోంది. చేరికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

వైనాట్ 175.. ఏపీలో బీఆర్ఎస్ తరపున పోటీ గ్యారెంటీ
X

ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ము ప్రతిపక్షాలకు ఉందా అంటూ అధికార వైసీపీ సవాళ్లు విసురుతూనే ఉంది. టీడీపీ 175 సీట్లలో పోటీ చేస్తుందా, లేక జనసేన 175 సీట్లకు అభ్యర్థుల్ని నిలబెడుతుందా అంటూ ప్రశ్నిస్తోంది. కానీ పొత్తుల వ్యవహారంలో అది సాధ్యమయ్యేలా లేదు. అందుకే ఆయా పార్టీల నుంచి స్పందన లేదు. అయితే కచ్చితంగా 175 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తరపున అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశమయితే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

గోదావరి జిల్లాలపై ప్రభావం..

ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇవ్వడంతో.. ప్రధానంగా ఆ వర్గం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విజయవాడ, గోదావరి జిల్లాల నుంచి చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. ఎస్సీ నేతలు కూడా బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో బీఆర్ఎస్ తీసుకున్న స్టాండ్ ఉత్తరాంధ్రలో కేసీఆర్ అభిమానుల్ని పెంచింది. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లానుంచి కూడా కొంతమంది కీలక నేతలు వైసీపీ ని వీడి బీఆర్ఎస్ లో చేరడం విశేషం.

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌ లో చేరారు. నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన వైసీపీ నేత కందాటి రజినీకాంత్‌ ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన వారు బీఆర్‌ఎస్‌ లో చేరారు. వారికి తోట చంద్రశేఖర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. హైదరాబాద్‌ కార్యాలయంలో ఈ చేరికలు జరిగాయి. ఏపీ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు తోట చంద్రశేఖర్.

ఈ ఊపు చూస్తుంటే ఏపీలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడం ఖాయమని తేలిపోతోంది. మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. బీఆర్ఎస్ మాత్రం పోటీ విషయంలో తగ్గేదే లేదంటోంది. చేరికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడిన తర్వాత, టికెట్ల కోలాహలంలో మరింతమంది అసంతృప్తులు బీఆర్ఎస్ వైపు చూస్తారనడంలో ఎలాంటి అనుమానం లేదు.

First Published:  21 April 2023 2:08 AM GMT
Next Story