Telugu Global
Andhra Pradesh

మాధవ్ కి ఉచ్చు బిగుస్తోంది.. డీజీపీకి మహిళా కమిషన్ లేఖ

విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొనడం విశేషం. మహిళా కమిషన్ కూడా స్పందించడంతో దాదాపుగా గోరంట్ల మాధవ్ చుట్టూ ఉచ్చు బిగిసినట్టేనని అంటున్నారు.

మాధవ్ కి ఉచ్చు బిగుస్తోంది.. డీజీపీకి మహిళా కమిషన్ లేఖ
X

గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో ఎందుకు స్పందించలేదంటూ ఏపీ మహిళా కమిష‌న్‌ను టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. ఇతర విషయాల్లో హడావిడి చేసే మహిళా కమిషన్, సాక్షాత్తూ ఓ ఎంపీ నగ్నంగా మహిళతో వీడియోకాల్ మాట్లాడితే ఎందుకు స్పందించలేదంటూ నిలదీశారు. దీంతో మహిళా కమిషన్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. ఆ వీడియోపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని డీజీపీకి లేఖ రాసింది. విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొనడం విశేషం. మహిళా కమిషన్ కూడా స్పందించడంతో దాదాపుగా గోరంట్ల మాధవ్ చుట్టూ ఉచ్చు బిగిసినట్టేనని అంటున్నారు.

మార్ఫింగ్ మాటలు అతకలేదు..

గతంలో ఒకరిద్దరు వైసీపీ నేతల ఆడియో క్లిప్ లు లీకయినా.. వాటిని నిరూపించడానికి పెద్దగా ఆధారాలు లేవు. కానీ ఇప్పుడు నేరుగా ఎంపీ నగ్న వీడియో బయటకొచ్చింది. అందులో ఉన్నది నేను కాదంటూ మాధవ్ కవర్ చేసుకోవాలని చూసినా ఆయన మాటలు నమ్మేట్టుగా లేవు. తాను జిమ్ లో షర్ట్ లేకుండా ఉన్న ఓ వీడియోని చూపించి అలాంటి వీడియోని మార్ఫింగ్ చేశారని చెప్పుకొచ్చారు మాధవ్. ఇది కూడాపెద్దగా అతికినట్టు అనిపించలేదు. దీంతో తనకు తానుగానే మాధవ్ ఈ వ్యవహారాన్ని ఒప్పుకున్నట్టయింది. కవర్ చేసుకోలేక తంటాలు పటుతున్నట్టు అర్థమయింది.

చర్యలు తప్పవంటున్న వైసీపీ నేతలు..

మరోవైపు వైసీపీ నేతలు కూడా ఆ వీడియో నిజమని తేలితే చర్యలు తప్పవంటూ కుండబద్దలు కొట్టారు. ఒకరిద్దరు కాదు, దాదాపుగా వైసీపీ నుంచి మాట్లాడిన సీనియర్ నేతలంతా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీంతో వైసీపీ నుంచి కూడా మాధవ్ పై సానుభూతి లేదని తేలిపోయింది. తాజాగా మహిళా కమిషన్ కూడా ఈ వ్యవహారంలో స్పందించడంతో ఇక మాధవ్ పై చర్యలే మిగిలున్నాయని అంటున్నారు. మరోవైపు మాధవ్ ని పార్లమెంట్ నుంచి, పార్టీనుంచి సస్పెండ్ చేయాలని టీడీపీ నిరసనలతో హోరెత్తిస్తోంది. మహిళలకు సంబంధించిన అంశం కావడంతో.. వైసీపీ నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత కానీ, విమర్శలు కానీ వినిపించడంలేదు. ఒకవేళ వైసీపీ నేతలెవరైనా మాధవ్ ని వెనకేసుకు రావాలని చూస్తే.. ఆ వీడియో నిజమని తేలితే అప్పుడు మరింత ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అందుకే వారంతా సైలెంట్ గా ఉన్నారు, జరిగే వ్యవహారాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు.

First Published:  6 Aug 2022 11:55 AM GMT
Next Story