Telugu Global
Andhra Pradesh

AP:వైసీపీ Vs వైసీపీ ఎమ్మెల్యే... రంజుగా వెంకటగిరి రాజకీయం

పెన్షన్లు ఇచ్చినంత మాత్రాన ఓట్లు రాలుతాయనుకోవడం భ్రమ అని తన స్వంత పార్టీమీదనే విరుచుకపడ్డారు ఆనం రాంనారాయణ రెడ్డి. అంతటితో ఆగకుండా ''ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే గనక జరిగితే ముందుగానే ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం'' అని డైరెక్ట్ గా జగన్ మీదనే దాడి ఎక్కుపెట్టాడు.

AP:వైసీపీ Vs వైసీపీ ఎమ్మెల్యే... రంజుగా వెంకటగిరి రాజకీయం
X

నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కి ఆయన స్వంత పార్టీ అయిన వైసీపీ కి మధ్య కొంత కాలంగా వార్ నడుస్తోంది. ఆనం బహిరంగంగానే పార్టీపై, పార్టీ అధిష్టానంపై విమర్శలు చేస్తున్నారు. ఆయన పద్దతి పట్ల జిల్లా నాయకులే కాకుండా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా గుర్రుగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.

సీనియర్ అయిన తనకు కాకుండా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన, అనీల్ కుమార్ యాదవ్ కు, ఆ తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవులు ఇవ్వడం పట్ల ఆనం చాలా కాలంగా ఆగ్రహంగా ఉన్నారు. ఆయన తన ఆగ్రహాన్ని ఎక్కడా దాచుకోకుండా పరోక్షంగా జగన్ పై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. పైగా ఆయన వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నట్టు నియోజకవర్గంలో ప్రచారంలో ఉంది.

ఈ రోజు ఆనం సైదాపురంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో చాలా గ్రామాలు అభివృద్ది చెందకుండా అలాగే ఉండిపోయాయని, వెంకటగిరి 107 సచివాలయాలు ఉన్న నియోజకవర్గం అని, కొన్ని సచివాలయాల పనులు ఇంకా పూర్తికాలేదని, కొన్ని పనులు ప్రారంభమైన తర్వాత నిలిచిపోయాయని అన్నారు ఆనం.

పెన్షన్లు ఇచ్చినంత మాత్రాన ఓట్లు రాలుతాయనుకోవడం భ్రమ అని తన స్వంత పార్టీమీదనే విరుచుకపడ్డారు. అంతటితో ఆగకుండా ''ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే గనక జరిగితే ముందుగానే ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం'' అని డైరెక్ట్ గా జగన్ మీదనే దాడి ఎక్కుపెట్టాడు.

ఆయన మాట్లాడిన మాటలపై మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్, మంత్రి గోవర్ధన్ రెడ్డిలు తీవ్రంగా స్పందించారు. ఆనంపై విరుచుకపడ్డారు. ఈ నేపథ్యంలో ఆనం ఊహించని పరిణామం జరిగింది.

ఆనం తీరుపై ఆగ్రహంగా ఉన్న వైఎస్ జగన్ ఆయనకు సరైన బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నారు. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న ఆనం రాంనారాయణ రెడ్డిని తొలగించి ఆయన స్థానంలో మాజీముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు నేదురుమ‌ల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయం ఆ ప్రకటనను ఈ రోజు విడుదల చేసిన కొంత సేపటికి ఆనం మీడియాతో మాట్లాడుతూ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. పార్టీ ఇంచార్జ్ గా ఎవరిని నియమిస్తారన్నది పార్టీ ఇష్టం అని ఆయన అన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం అంటూ ఆనం వ్యాఖ్యానించారు.

కొ‍ంత కాలంగా వెంకటగిరి నియోజకవర్గంలో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి వైసీపీలో చురుకుగా కార్యకలాపాలు సాగిస్తూ ఉండటం, పార్టీ అధిష్టానం కూడా ఆయనకే ప్రాధాన్యత ఇవ్వడం తట్టుకోలేకపోతున్న ఆనం కు ఇప్పుడు జగన్ కొట్టిన దెబ్బతో దిమ్మతిరిగినట్టయ్యింది.

ఇకపై కార్యకర్తలు కానీ, అధికారులు కానీ ఆనం చెప్పింది కాకుండా రాంకుమార్ చెప్పిందే వినాలని విజయవాడనుంచి ఆదేశాలు కూడా వెళ్ళాయని సమాచారం.

ఇప్పుడిక ఆనం రాంనారాయణరెడ్డి పార్టీలో ఉంటారా ? రాజీనామా చేసి మరో పార్టీలో చేరుతారా ? అనే చర్చ నియోజకవర్గంలో అప్పుడే మొదలయ్యింది. లేదంటే మరో దారి కూడా ఆయన ఎంచుకునే అవకాశం ఉంది. ఎన్నికలు ఇంకా చాలా కాలమే ఉన్నాయి కాబట్టి ఇప్పుడే పదవి పోగొట్టుకోకుండా వైసీపీలోనే ఉంటూ ఆ పార్టీకి పొగపెట్టే విధంగా వ్యవ‌హరించవచ్చు. ఒక వేళ అదే జరిగితే వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వలే ఎమ్మెల్యే ఆనం కూడా జగన్ కంట్లో నలుసులా మారతాడేమో ?

First Published:  3 Jan 2023 3:08 PM GMT
Next Story