Telugu Global
Andhra Pradesh

టెన్త్ పేపర్ కరెక్షన్.. దిద్దేవారికి అసలైన పరీక్ష

రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ల సమయంలో మార్పులు చేయాల్సి వస్తే అందుకు పేపర్ దిద్దినవారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పొరపాట్లు చేసిన వారిపై నిబంధనల ప్రకారం పెనాల్టీ విధిస్తారు. క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయి.

టెన్త్ పేపర్ కరెక్షన్.. దిద్దేవారికి అసలైన పరీక్ష
X

ఈనెల 3న ఏపీలో మొదలైన పదో తరగతి పరీక్షలు 18వ తేదీతో ముగుస్తాయి. 19నుంచి పేపర్ కరెక్షన్ కు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 19నుంచి 26 వరకు పేపర్ కరెక్షన్ కు షెడ్యూల్ రెడీ చేశారు ఉన్నతాధికారులు. అయితే ఈసారి నిబంధనలు కాస్త కఠినతరం చేశారు. విద్యార్థులకే కాదు, పేపర్లు దిద్దేవారికి కూడా ఇవి పరీక్షలే అని చెప్పాలి.

రీ వెరిఫికేషన్లో మార్పులుంటే..

పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత తక్కువ మార్కులు వచ్చాయనుకునేవారికి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కు అవకాశం ఉంది. జవాబు పత్రాల ఫొటోస్టాట్‌ కాపీలను కూడా వారికి అందిస్తారు. అందుకే ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ల సమయంలో మార్పులు చేయాల్సి వస్తే అందుకు పేపర్ దిద్దినవారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పొరపాట్లు చేసిన వారిపై నిబంధనల ప్రకారం పెనాల్టీ విధిస్తారు. క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయి.

ఛాయిస్ ప్రశ్నలకు మార్కులు ఇలా..

కొంతమంది విద్యార్థులు ఛాయిస్ జోలికి పోరు. అలాంటి వారి విషయంలో ఏ సమస్యా ఉండదు. కొందరు ఛాయిస్ గా ఇచ్చిన ప్రశ్నలకు కూడా జవాబులు రాస్తారు. ఛాయిస్ గా రాసిన సమాధానాలను దిద్దాల్సిన బాధ్యత కరెక్షన్ చేసేవారిపై ఉండదు. అయితే ఒకవేళ అలా ఛాయిస్ ప్రశ్నలకు కూడా వారు మార్కులు వేస్తే.. వాటిని లెక్కించే విషయంలో ఈసారి నూతన నిబంధన తీసుకొచ్చారు. ఛాయిస్ గా రాసిన సమాధానాల్లో వేటికి ఎక్కువ మార్కులు వస్తాయో వాటినే పరిగణలోకి తీసుకుంటారు.

మూడు అంచెల్లో..

అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్లు కరెక్షన్ చేస్తారు. వారు కూడా రోజుకి గరిష్టంగా 40 పేపర్లు మాత్రమే దిద్దాల్సి ఉంటుంది. వారు పేపర్లను దిద్ది మార్కులు వేసిన తర్వాత, వాటిని కూడి ఫైనల్ రిజల్ట్ వేయాల్సిన బాధ్యత స్పెషల్ అసిస్టెంట్ లది. ఆ తర్వాత వాటిని మరోసారి తనిఖీ చేయాల్సిన బాధ్యత చీఫ్ ఎగ్జామినర్లది. ఇలా మూడంచెల్లో ఎక్కడా తప్పులు దొర్లకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

First Published:  13 April 2023 12:38 AM GMT
Next Story