Telugu Global
Andhra Pradesh

ఏపీలో ఇసుక సొమ్ము ఎటు పోతోంది..?

ప్రజలకు ఇసుక విక్రయించడంతోపాటు ఉపాధి హామీ పనులు, నాడు- నేడు, జగనన్న ఇళ్ల నిర్మాణాలకు కూడా జేపీ సంస్థ ఇసుక సరఫరా చేస్తోంది. వాటికి బిల్లులు పెట్టుకున్నా అవి సకాలంలో విడుదల కావడంలేదు.

ఏపీలో ఇసుక సొమ్ము ఎటు పోతోంది..?
X

ఏపీలో ప్రభుత్వానికి ఉన్న ప్రధాన ఆదాయ వనరుల్లో ఇసుక కూడా ఉంది. ఈ విషయంలో గతంలో ప్రయోగాలు చేసి టీడీపీ ప్రభుత్వం ఇబ్బందులు పడింది. మొదట ఉచితం అన్నారు, ఆ తర్వాత డ్వాక్రా మహిళలకు నిర్వహణకు ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఇసుక విధానం మార్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక పాలసీ మళ్లీ మారింది. కొన్నాళ్లు ప్రభుత్వమే ఇసుక అమ్మింది. ఇసుక రీచ్ ల వద్ద వీఆర్వోలు, ఎమ్మార్వోలు కూడా డ్యూటీలు చేశారు. ఆ తర్వాత పద్ధతి మార్చారు. ఉత్తరాదికి చెందిన జయప్రకాష్ పవర్ వెంచర్స్ (జేపీ) గ్రూప్ కి ఏకమొత్తంగా ఇసుక తవ్వకం, అమ్మకాల బాధ్యత అప్పగించింది. ఈ డీల్ తో స్థానికంగా ఇసుకాసురులుగా మారే అవకాశం ఎవరికీ దక్కలేదు. అయితే జేపీ వెంచర్ తో ప్రభుత్వం కుదుర్చుకున్న భారీ డీల్ తో నేరుగా పెద్దలకే లబ్ధి చేకూరుతుందనే ఆరోపణలు మాత్రం వినిపించాయి.

ఇసుక సొమ్ము ఏ ఖాతాలో..?

2021, మే 14 నుంచి ఇసుక తవ్వకాలు, అమ్మకాలను జేపీ వెంచర్స్ ప్రారంభించింది. ఏడాదికి 2 కోట్ల టన్నుల ఇసుక విక్రయాలు జరుగుతాయని, కాంట్రాక్ట్ సంస్థ టన్ను రూ.475 చొప్పున విక్రయిస్తుందని, అందులో రూ.375 ప్రభుత్వానికి చెల్లిస్తుందని అప్పట్లో గనులశాఖ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వానికి ఏడాదికి రూ.765 కోట్ల ఆదాయం వస్తుందని ప్రకటించారు. ప్రతి నెలా ముందుగానే జేపీ వెంచర్స్ సంస్థ అడ్వాన్స్ లు చెల్లించేలా కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రతి నెలా 1వతేదీన రూ.31.87 కోట్లు, 16వ తేదీన మరో 31.87 కోట్ల రూపాయలు అడ్వాన్సుగా ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ కొన్ని నెలలుగా ఈ చెల్లింపులు ఆగిపోయాయనే వార్తలొస్తున్నాయి. దీనిపై ఆర్థిక శాఖ ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

మా బకాయిల సంగతేంటి..?

ప్రజలకు ఇసుక విక్రయించడంతోపాటు ఉపాధి హామీ పనులు, నాడు- నేడు, జగనన్న ఇళ్ల నిర్మాణాలకు కూడా జేపీ సంస్థ ఇసుక సరఫరా చేస్తోంది. అయితే వాటికి బిల్లులు పెట్టుకున్నా అవి సకాలంలో విడుదల కావడంలేదు. దీంతో జేపీ సంస్థ ప్రతి నెలా 1వతేదీ, 16వతేదీ జమ చేయాల్సిన అడ్వాన్స్ లు ఆపేసింది. వాటిని అడిగితే, ముందు వీటి లెక్క తేల్చండని ఆ సంస్థ ప్రతినిధులు అడుగుతున్నారట. దీంతో జిల్లాల వారీగా ప్రభుత్వ పనులకోసం ఎంతెంత ఇసుక తీసుకున్నారో లెక్కలు ఇవ్వాలంటూ గనుల శాఖ అధికారులు.. జిల్లా అధికారులను కోరారు. ఈ లెక్కలు తేలిన తర్వాతే ఇసుక సొమ్ము ప్రభుత్వ ఖజానాకి చేరే అవకాశాలున్నాయి.

First Published:  27 Jan 2023 2:57 AM GMT
Next Story