Telugu Global
Andhra Pradesh

ఏపీలో రిజర్వేషన్ల గోల.. ఆదివాసీల ఆందోళన

ప్రభుత్వ తీర్మానం మేరకు రిజర్వేషన్లు అమలులోకి వస్తే తాము పూర్తిగా నష్టపోతామని అంటున్నారు ఆదివాసీలు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రిజర్వేషన్ల కోటాకు గండిపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో రిజర్వేషన్ల గోల.. ఆదివాసీల ఆందోళన
X

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ రెండు కీలక తీర్మానాలు చేసింది. దళిత క్రిస్టియన్లు రిజర్వేషన్లు కోల్పోకుండా చేసేలా తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. బోయ వాల్మీకి, బెంతు ఒరియాలకు ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చేందుకు చేసిన తీర్మానం మరొకటి. ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో ఇప్పుడు ఏపీలో చిచ్చురేగింది. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న ఆదివాసీలు, శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ లోని ఏజెన్సీ ప్రాంతాల బంద్ కు పిలుపునిచ్చారు. వైసీపీ మినహా ఇతర రాజకీయ పార్టీలు ఈ బంద్ కి మద్దతిచ్చాయి.

మావోయిస్టులు కూడా ఈ రిజర్వేషన్ల విషయంపై బహిరంగ లేఖ విడుదల చేశారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు అధికారపార్టీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఈస్ట్ డివిజన్ కార్యదర్శి గణేష్ బహిరంగ లేఖలో పిలుపునిచ్చారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు.

మాకు నష్టం..

ప్రభుత్వ తీర్మానం మేరకు రిజర్వేషన్లు అమలులోకి వస్తే తాము పూర్తిగా నష్టపోతామని అంటున్నారు ఆదివాసీలు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రిజర్వేషన్ల కోటాకు గండిపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన రోజు నుంచి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు, సాంప్రదాయ ఆయుధాలతో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు కూడా నిరసన సెగ తగులుతోంది. అసెంబ్లీలో తీర్మానాన్ని ఎందుకు వ్యతిరేకించలేదని వారు ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. ఇక బంద్ పిలుపుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మావోయిస్టు పార్టీ కదలికలపై నిఘా పెంచింది. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజా ప్రతినిధులకు సెక్యూరిటీ పెంచారు.

First Published:  30 March 2023 1:03 PM GMT
Next Story