Telugu Global
Andhra Pradesh

హమ్మయ్య.. ఆ హత్య చేసింది వాలంటీర్ కాదు..!

హత్య జరిగింది అంటే.. మృతుడు ఎవరు..? కారణం ఏంటి..? అనే విషయాలు ముందుగా బయటకొస్తాయి. కానీ ఇప్పుడు ఏపీలో హత్య చేసింది వాలంటీరా, లేక హంతకులతో వాలంటీర్ కి దూరపు చుట్టం ఉందా అనే విషయాలు హైలెట్ అవుతున్నాయి.

హమ్మయ్య.. ఆ హత్య చేసింది వాలంటీర్ కాదు..!
X

ఏపీలో రాజకీయాలు ఇప్పుడు శవాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ విశాఖలో హత్యకు గురైన వృద్ధురాలి కుటుంబాన్ని పరామర్శించారు. వాస్తవానికి ఆ కుటుంబానికి, పవన్ కల్యాణ్ కి, జనసేనకు ఎలాంటి సంబంధం లేదు. కానీ వాలంటీర్ ఆ హత్య చేశాడు అనగానే పవన్ వెళ్లి పరామర్శించారు, పనిలో పనిగా 'వాలంటీర్ల సంగతి నేనెప్పుడో చెప్పా' అంటూ విమర్శించారు. కట్ చేస్తే.. నిందితుడు వెంకటేష్ అసలు వారంటీరే కాదంటోంది వైసీపీ. అతడు వాలంటీర్ కాదని, ఆ విషయాన్ని మృతురాలు కోటగిరి వరలక్ష్మి భర్త స్వయంగా సాక్షితో చెప్పాడని సంబరపడుతోంది.

వాలంటీర్ కాకపోతే ఏంటి..?

హత్య జరిగింది అంటే.. మృతుడు ఎవరు..? కారణం ఏంటి..? అనే విషయాలు ముందుగా బయటకొస్తాయి. కానీ ఇప్పుడు ఏపీలో హత్య చేసింది వాలంటీరా, లేక హంతకులతో వాలంటీర్ కి దూరపు చుట్టం ఉందా అనే విషయాలు హైలెట్ అవుతున్నాయి. వాలంటీర్లు, లేదా వాలంటీర్ల కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన క్రైమ్ వార్తలకు టీడీపీ అనుకూల మీడియా ఏకంగా ఓ అరపేజీ కేటాయించింది. ఇక వాటికి ఖండనలకోసం వైసీపీ అనుకూల మీడియా నానా తంటాలు పడుతోంది. వరలక్ష్మి అనే వృద్ధురాలు చనిపోయిన సందర్భంలో హంతకుడు వాలంటీర్ అంటూ టీడీపీ అనుకూల మీడియా రచ్చ చేస్తే, కాదు కాదు మాజీ వాలంటీర్ అంటూ వైసీపీ అనుకూల మీడియా కథనాలిచ్చింది. హత్య అనే విషయం పక్కకు పోయి, వాలంటీర్ అనే విషయమే హైలెట్ అవుతోంది.

ఆ హత్యకు, వాలంటీర్ కి సంబంధం లేదు సరే.. అంతమాత్రాన వైసీపీ సంబరపడుతూ ప్రతిపక్షాలను తూర్పారబట్టడం దేనికి సంకేతం. వైజాగ్ లో తప్పు జరిగితే ప్రభుత్వానికి బాధ్యత లేదా..? ఆడవారిపై అఘాయిత్యాలు ఆగకుండా జరుగుతుంటే.. దిశ చట్టం ఏంచేస్తోందనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. టీడీపీ హయాంలో జరగలేదా..? అప్పుడు చేసినవి తప్పులు కాదా..? ఎమ్మార్వో వనజాక్షి వ్యవహారంలో తప్పెవరిది..? విజయవాడ కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితులెవరు..? అంటూ వైసీపీ పాత విషయాలను తవ్వి తీస్తోంది. అవసరానికి మించి హడావిడి చేయడం టీడీపీ అనుకూల మీడియా అలవాటు చేసుకుంటే.. పాత తప్పులు ఎత్తి చూపి పలాయనం చిత్తగించడం వైసీపీ అనుకూల మీడియాకు రివాజుగా మారింది. మొత్తమ్మీద ఏపీలో సమస్యలు పక్కదారి పట్టి, ఈ నిందారోపణలే ఎక్కువవుతున్నాయి.

First Published:  14 Aug 2023 7:15 AM GMT
Next Story