Telugu Global
Andhra Pradesh

పేర్ని తర్వాత అంబటి.. వారాహి చుట్టూ ఏపీ రాజకీయం

ఆలివ్ గ్రీన్ రంగు - ఆర్టీఏ నియమాలు అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ఆలివ్ గ్రీన్ రంగు ఉన్న షర్ట్ ఫొటో ట్యాగ్ చేయడంతో అది మరో రచ్చకు దారితీసింది.

పేర్ని తర్వాత అంబటి.. వారాహి చుట్టూ ఏపీ రాజకీయం
X

ఏపీ రాజకీయం అంతా ఇప్పుడు వారాహి చుట్టూనే తిరుగుతోంది. ఆ వాహనం పొడవెంత, వెడల్పెంత, దాని రంగేంటి, దానికి రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా, ఆలివ్ గ్రీన్ నుంచి పసుపు రంగులోకి మార్చాలంటే ఖర్చెంత..? ఇలా రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకరకంగా వారాహికి జనసేన కంటే ఎక్కువగా పబ్లిసిటీ ఇచ్చేశారు వైసీపీ నేతలు. జనసేన కోరుకునేది కూడా అదే. పవన్ కల్యాణ్ చిన్న ట్వీట్ చేశారు, వైసీపీ నుంచి ట్వీట్ల వర్షం కురిసింది, మాజీ మంత్రులు, తాజా మంత్రులు అందరూ బయటకొచ్చేశారు. పేర్ని నాని తర్వాత ఇప్పుడు అంబటి రాంబాబు.. పవన్ కల్యాణ్ కి కౌంటర్ ఇచ్చారు. శ్వాస తీసుకో, ప్యాకేజీ వద్దు అంటూ సింగిల్ లైన్ లో తేల్చేశారు.


అంతకు ముందు పవన్ కల్యాణ్, వారాహి వాహనంపై జరుగుతున్న రచ్చపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రంగు మార్చాలంటూ వస్తున్న సలహాలపై ఆయన మండిపడ్డారు. ఆలివ్ గ్రీన్ రంగులో ఉన్న వివిధ వాహనాల ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. చివరకు శ్వాస తీసుకోడానికి కూడా వైసీపీ పర్మిషన్ తీసుకోవాలేమో అని ట్వీట్ చేశారు. దీనికి అంబటి కౌంటర్ ఇచ్చారు. శ్వాస తీసుకో కానీ ప్యాకేజీ వద్దు అంటూ ప్యాకేజీ ప్రస్తావన తెచ్చారు. అంబటి ట్వీట్ పై ఇంకా మంట రాజుకోలేదు, జనసేన నుంచి కౌంటర్లు అప్పుడే స్టార్ట్ కాలేదు.

వారాహికి భారీ హైప్..

పవన్ కల్యాణ్ ప్రచారం ఎప్పుడు మొదలు పెడతారో తెలియదు కానీ, వాహనం సిద్ధమైందంటూ ఆయన వేసిన ట్వీట్, అందులో ఆ వాహనంతో కలసి దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఆ వాహనం విషయం తెలియని వారికి కూడా వైసీపీ నేతలు పిలిచి మరీ వారాహి వాహనం, దాని రంగు-రుచి-వాసన గురించి చెప్పేశారు. ఆలివ్ గ్రీన్ రంగు - ఆర్టీఏ నియమాలు అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ఆలివ్ గ్రీన్ రంగు ఉన్న షర్ట్ ఫొటో ట్యాగ్ చేయడంతో అది మరో రచ్చకు దారితీసింది.ఆ కలర్ లో ఉన్న కట్ డ్రాయర్లనుంచి, ఇతర లోదుస్తులన్నీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వీటిపై కూడా ఏపీలో నిషేధం ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు జనసైనికులు. మొత్తమ్మీద పవన్ కల్యాణ్, జనసైనికులు ఊహించినదానికంటే ఆ వాహనానికి, పవన్ యాత్రకు భారీ హైప్ తెచ్చిపెట్టారు వైసీపీ నేతలు.

First Published:  10 Dec 2022 2:06 AM GMT
Next Story