Telugu Global
Andhra Pradesh

నోట్లో లాలిపాప్ లు.. జుగుప్సగా ఏపీలో రాజకీయ విమర్శలు

ఏపీలో రాజకీయ విమర్శలు మరీ శృతి మించుతున్నాయి. నోట్లో లాలిపాప్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది.

నోట్లో లాలిపాప్ లు.. జుగుప్సగా ఏపీలో రాజకీయ విమర్శలు
X

విమర్శల్లో యథేచ్ఛగా బూతులు వాడతారంటూ అనవసరంగా కొడాలి నానిని అందరూ ఆడిపోసుకున్నారు కానీ, ఆయన చాలా బెటర్ అనిపించేలా నేడు పరిస్థితులు తయారయ్యాయి. ఏపీలో రాజకీయ విమర్శలు వింటుంటే అత్యంత జుగుప్సాకరంగా మారిపోయాయని అర్థమవుతోంది. వాడు, వీడు, అరేయ్ ఒరేయ్, నీ పెళ్లాం, నీ తల్లి.. అనేవి సర్వ సాధారణంగా మారిపోయాయి. ఇప్పుడు కొత్తగా నోట్లో లాలిపాప్ అనేది నాయకుల నోళ్లలో నానుతోంది. నోట్లో ఐస్ క్రీమ్, నోట్లో లాలిపాప్ అనే పదాలపై మంత్రి రోజా పేటెంట్ తీసుకున్నట్టున్నారు. పవన్ కల్యాణ్ ని విమర్శించే క్రమంలో ఆమె.. టీడీపీ హయాంలో పవన్ నోరెందుకు మెదపలేదు, నోట్లో ఏం పెట్టుకున్నారని కౌంటర్లిచ్చారు. ఒకటి రెండుసార్లు కాదు, రోజా ప్రెస్ మీట్లలో పదే పదే ఈ పదం దొర్లుతోంది. అప్పట్లో చంద్రబాబు హయాంలో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పవన్ నోట్లో పెట్టుకున్నాడా అని విమర్శిస్తున్నారు రోజా.

రోజాకు కౌంటర్లు..

రోజా వెటకారం చేస్తే జనసైనికులు వెనక్కి తగ్గుతారా..? వారు కూడా రెచ్చిపోయారు. గతంలో రోజా టీడీపీలో ఉన్నప్పుడు ఆమె నోట్లో ఏం పెట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు చిత్తూరు జిల్లా జనసేన నేతలు. అప్పట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్న రోజా అది నచ్చక, ఇప్పుడు అమూల్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అని మండిపడ్డారు.

మధ్యలో వెల్లంపల్లి..

మాజీ మంత్రి వెల్లంపల్లి కూడా ఇలాంటి విమర్శలతో పవన్ ని టార్గెట్ చేశారు. వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేస్తున్న పవన్.. గతంలో టీడీపీ జన్మభూమి కమిటీలు ఉన్నప్పుడు నోట్లో లాలీ పాప్‌ లు పెట్టుకున్నాడా అంటూ ఎద్దేవా చేశారు వెల్లంపల్లి. అలాంటి వెధవలను ప్రజలు ఎప్పటికీ నమ్మరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల కోసం మంచి చేస్తున్న సీఎం జగన్‌ ని ఏకవచనంతో పిలిస్తే, పవన్ తాట తీస్తామని హెచ్చరించారు. వారాహి యాత్ర పేరుతో బండి మీద నిలబడి ఊరపందిలా మాట్లాడటం కాదని.. ఒకసారి తమ ప్రాంతాలకు వస్తే ప్రజలకు జరిగే మేలు కనిపిస్తుందన్నారు. పగలు బీజేపీతో సంసారం.. రాత్రి టీడీపీతో కాపురం చేసే వ్యక్తి పవన్ కల్యాణ్ అని మండిపడ్డారు.

First Published:  15 July 2023 7:30 AM GMT
Next Story