Telugu Global
Andhra Pradesh

రంగా చుట్టూ ఏపీ రాజకీయం.. కాపు ఓట్ల కోసం పార్టీల కొట్లాట

టీడీపీ ఓడిపోయిన నాటి నుంచి గంటా శ్రీనివాసరావు, బోండా ఉమ వంటి నాయకులతో పాటు బీజేపీకి చెందిన కన్నా లక్ష్మీనారాయణ సైలెంట్ అయిపోయారు.

రంగా చుట్టూ ఏపీ రాజకీయం.. కాపు ఓట్ల కోసం పార్టీల కొట్లాట
X

ఏపీలో రాజకీయం అంతా ఇప్పుడు వంగవీటి రంగా చుట్టూ తిరుగుతోంది. రంగా హత్య చేయబడి మూడు దశాబ్దాలు గడిచిపోయినా.. ప్రతీ సారి ఎన్నికలు వచ్చాయంటే కాపు ఓట్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు రంగా జపం చేస్తుంటాయి. ఏపీ అసెంబ్లీకి మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రతీ పార్టీ పలు సామాజిక వర్గాల ఓట్లు తమకే పడేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో బలంగా ఉన్న కాపుల ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. రాబోయే ఎన్నికల్లో బలమైన వైసీపీని ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని ఆయన అంటున్నారు. అయితే అది ప్రాక్టికల్‌గా అంత ఈజీ అయిన విషయం కాదు.

2024 అసెంబ్లీ ఎన్నికల సమయానికి టీడీపీ-బీజేపీ-జనసేనతో పాటు వామపక్షాలు జట్టు కడితేనే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూసే అవకాశం ఉంటుంది. కానీ టీడీపీతో జట్టు కట్టడానికి బీజేపీ సిద్ధంగా లేదు. ఇక పవన్ కల్యాణ్‌ను మాత్రమే ముందు పెట్టి రాజకీయం చేస్తే కాపు ఓట్లు పూర్తిగా పడతాయనే నమ్మకం టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా లేదు. అందుకే మరో సారి వంగవీటి రంగా పేరును తెరపైకి తీసుకొని వచ్చినట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది. నేరుగా చంద్రబాబే రంగా పేరు ఎత్తితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే రంగా దారుణ హత్య వెనుక తెలుగుదేశం పార్టీనే ఉన్నట్లు విజయవాడలో సహా ఏపీలో ఏ కాపు వర్గపు నాయకుడిని అడిగినా చెప్తాడు. అలాంటప్పుడు చంద్రబాబు నేరుగా రంగా పేరుతో ఓట్లు అడగలేరు. అందుకే కొంత మంది కీలక నాయకులను ముందు పెట్టి కాపు ఓట్లు చీలకుండా చూడాలని కొత్త ఎత్తు వేసినట్లు తెలుస్తున్నది.

గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన నాటి నుంచి గంటా శ్రీనివాసరావు, బోండా ఉమ వంటి నాయకులతో పాటు బీజేపీకి చెందిన కన్నా లక్ష్మీనారాయణ సైలెంట్ అయిపోయారు. నిన్న మొన్నటి వరకు గంటా, కన్నా వేరే పార్టీల్లో చేరడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. గంటా శ్రీనివాసరావు తన అనుచరులతో వైసీపీలో చేరుతున్నట్లు లీకులు ఇచ్చారు. ఇదిగో ముహూర్తం.. అదిగో చేరిక తేదీ అంటూ వార్తలు రాయించుకున్నారు. కానీ వైసీపీ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఇప్పుడు కాపునాడు పేరుతో సరికొత్త రాగం అందుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా తనకు కాపు ఓట్లు అవసరం అవుతాయి కాబట్టే.. ఏనాడూ చేయనంత హడావిడి కాపునాడు విషయంలో చేస్తున్నారు. తనకు అనుకూలమైన విశాఖపట్నం వేదికగానే డిసెంబర్ 26న రంగా వర్దంతి నాడు ఈ సభ నిర్వహించనున్నారు.

ఇక కన్నా లక్ష్మీనారాయణను కూడా కాపునాడుకు ఒప్పించింది జనసేన నేతలే అన్నది బహిరంగ రహస్యమే. ఇటీవలే నాదెండ్ల మనోహర్ స్వయంగా కన్నా ఇంటికి వెళ్లి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరమే విజయవాడ వేదికగా గంటా శ్రీనివాసరావు, బోండ ఉమతో కలసి కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సీఎం చేయడమే తమ లక్ష్యమని కాపునాడు నేతలు ప్రకటించుకున్నారు. పార్టీలకు అతీతంగా కాపులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. చంద్రబాబు కావాలనే తెర వెనుక కాపు నేతలతో ఆ మాట చెప్పిస్తున్నారని.. కాపుల ఓట్లు చీలకుండా చూసి, జనసేనతో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి లాభిస్తుందనే వ్యూహంతో ఆయన ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

చంపించిన వాళ్లే విగ్రహాలు పెడుతున్నారు : వంగవీటి నరేంద్ర

కాపునాడు రాజకీయాలు ఇలా జరుగుతుండగానే రంగా సోదరుడు వంగవీటి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకనాడు రంగాను చంపించిన వాళ్లే ఈ రోజు ఆయనకు విగ్రహాలు పెడుతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరి వంగవీటి రాధ చారిత్రక తప్పు చేశారని ఆయన మండిపడ్డారు. ప్రతీ సారి ఎన్నికలు రాగానే రంగా పేరు అన్ని పార్టీలు జపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. రంగాను చంపిన పార్టీ ఏంటో అందరికీ ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే పార్టీ రంగా పేరుతో రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. ప్రజలు ఏమీ తెలివితక్కువ వాళ్లు కాదని, తప్పకుండా ఆ పార్టీకి బుద్ది చెబుతారని టీడీపీపై విమర్శలు చేశారు.

వైసీపీ జగ్గయ్యపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను కూడా టీడీపీపై విమర్శలు చేశారు. పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న రంగాను ఆనాడు టీడీపీ హత్య చేయించిందని అన్నారు. ఆ సమయంలో వంగవీటి రాధా పక్కనే ఉండటం గమనార్హం. రాధా, టీడీపీలోనే ఉన్నా.. రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అందుకే ఉదయభాను వ్యాఖ్యల అనంతరం కూడా ఎలాంటి ఖండనలు చేయకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. రంగా చుట్టు ఇప్పుడు ఇంత రాజకీయం జరుగుతున్నా.. రాధా మాత్రం బహిరంగ వ్యాఖ్యలు చేయడం లేదు. ఇక వైసీపీలోని కాపు నేతలు మాత్రం ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా అని కొట్టిపారేస్తున్నారు. మొత్తానికి ఎన్నికలు దగ్గర అవుతున్న కొద్దీ.. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.

First Published:  20 Dec 2022 12:38 PM GMT
Next Story