Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే.. ఏపీ పోలీస్ అధికారుల సంఘం డిమాండ్

పోలీసులెవరూ రాజకీయ పార్టీలకు, నేతలకు కట్టుబానిసలు కారని, వారు కేవలం రాజ్యాంగానికి మాత్రమే కట్టుబానిసలని స్పష్టం చేశారు పోలీస్ అధికారుల సంఘం నేతలు. తమపై చేసిన తప్పుడు ఆరోపణలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే.. ఏపీ పోలీస్ అధికారుల సంఘం డిమాండ్
X

కొంతమంది పోలీసులు వైసీపీకి కట్టుబానిసల్లా పనిచేస్తున్నారని, వారందరి వ్యవహారం తాము అధికారంలోకి వచ్చాక తేల్చేస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఇతర నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం మండిపడింది. పోలీసులెవరూ రాజకీయ పార్టీలకు, నేతలకు కట్టుబానిసలు కారని, వారు కేవలం రాజ్యాంగానికి మాత్రమే కట్టుబానిసలని స్పష్టం చేశారు పోలీస్ అధికారుల సంఘం నేతలు. తమపై చేసిన తప్పుడు ఆరోపణలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు పోలీస్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యల్ని పక్కనే ఉన్న చంద్రబాబు ఖండించకపోగా, సమర్థించినట్టు ప్రవర్తించారని, ఇది క్షమించరాని విషయం అని అన్నారు.

పోలీసులు నిజంగా అధికార పక్షానికి కొమ్ము కాస్తే చంద్రబాబు పర్యటనలు ఎందుకంత సురక్షితంగా జరుగుతున్నాయని ప్రశ్నించారు పోలీస్ అధికారుల సంఘం నేతలు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యల్ని సమర్థించడం సరికాదన్నారు. టీడీపీ కార్యకర్తల సభలో రాజ్యాంగ వ్యవస్థలపై ఎలా కుట్రలు చేయాలి, ఎలా మోసాలు చేయాలనే విషయంపై శిక్షణ ఇచ్చారని ఆరోపించారు. సమాజంలో ఆందోళనలు, అలజడులు చెలరేగేలా వ్యాఖ్యలు చేయడం దారుణం అని అన్నారు.

చంద్రబాబు ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా 250మంది పోలీసులు అంకిత భావంతో, కట్టు బానిసల్లా విధులు నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకునే విధంగా న్యాయపోరాటం చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలను సమర్థించిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. చంద్రబాబు కూడా కొందరు పోలీసులంటూ తెలివిగా అందరిపై నెపం నెట్టేలా మాట్లాడుతున్నారని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం చేయొద్దని హెచ్చరించారు.

First Published:  22 Nov 2022 2:02 AM GMT
Next Story