Telugu Global
Andhra Pradesh

ఏపీలో అవ్వాతాతలకు డబుల్ బొనాంజా..

ఏపీలో ఎన్ని సమస్యలున్నా, సామాజిక పెన్షన్లు మాత్రం ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా ఆ ట్రాక్ రికార్డ్ ని గొప్పగా మెయింటెన్ చేస్తూ వస్తున్నారు సీఎం జగన్.

ఏపీలో అవ్వాతాతలకు డబుల్ బొనాంజా..
X

ఏపీలో అవ్వాతాతలకు కొత్త ఏడాది కానుకగా పెరిగిన పెన్షన్లు ఇవ్వబోతున్నారు సీఎం జగన్. నెలకు రూ.3వేల పెన్షన్ తో ఎన్నికల హామీని పూర్తి స్థాయిలో ఆయన అమలు చేస్తున్నట్టయింది. పెన్షన్ పెంపుతోపాటు, కొత్త పెన్షన్లు కూడా జనవరినుంచే అమలులోకి వస్తాయంటున్నారు. కొత్త లబ్ధిదారులు నేరూగా 3వేల రూపాయల పెన్షన్ అందుకుంటారు.

ఏపీలో ఎన్ని సమస్యలున్నా, సామాజిక పెన్షన్లు మాత్రం ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా ఆ ట్రాక్ రికార్డ్ ని గొప్పగా మెయింటెన్ చేస్తూ వస్తున్నారు సీఎం జగన్. ఒకటో తేదీనే పెన్షన్లు అవ్వాతాతల ఇంటికి వెళ్లి మరీ ఇస్తున్నారు వాలంటీర్లు. రూ.2వేలనుంచి విడతల వారీగా రూ.3వేలకు పెన్షన్లను పెంచారు. సరిగ్గా ఎన్నికల ఏడాది నాటికి ఈ పెంపు పూర్తయింది. సహజంగానే ఈ పెంపు వైసీపీకి మరింత మైలేజీ పెంచుతుంది. అదే సమయంలో కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం మొదలు పెడుతున్నారు. వీరంతా జగన్ ప్రభుత్వంపై సానుకూల ధోరణితో ఉంటారనేది వాస్తవం.

మళ్లీ పెంచుతారా..?

ఏపీలో పెన్షన్ల పెంపు బాగుందని, తాము కూడా అదే విధానం అమలు చేస్తామని ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కూడా హామీ ఇచ్చింది. అదే సమయంలో 2024 ఎన్నికల్లో ఏపీలో సామాజిక పెన్షన్ల పెంపు హామీలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ ఎంతమేరకు పెంచుతామని చెబుతుంది..? వైసీపీ ఏ స్థాయిలో పెంపు ఉంటుందని భరోసా ఇస్తుంది..? అనేవి ప్రస్తుతానికి సస్పెన్స్. పెన్షన్ల విషయంలో చంద్రబాబు కంటే జగన్ నే ప్రజలు ఎక్కువగా నమ్మే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో ఉంది. అయితే ఈ దఫా పెంపు ఉంటుందా, లేక ఆర్థిక పరిస్థితిని బట్టి పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి వదిలేస్తారా అనేది వేచి చూడాలి.

First Published:  25 Dec 2023 4:53 AM GMT
Next Story