Telugu Global
Andhra Pradesh

సెల్ఫ్ డబ్బాల మోత.. ఏపీలో పంచాయతీ ఉప పోరు

అధికార పార్టీకే మళ్లీ అధిక స్థానాలు దక్కాయి. ఏకగ్రీవాలతో కలిపి చూస్తే గతంలో స్థానిక ఎన్నికల ఫలితాలే రిపీటయ్యాయి. అయితే వైనాట్ 175 అంటున్న వైసీపీకి టీడీపీ, జనసేన ఉనికి ఓ హెచ్చరిక అని చెప్పుకోవాలి.

సెల్ఫ్ డబ్బాల మోత.. ఏపీలో పంచాయతీ ఉప పోరు
X

ఏపీలో శనివారం 34 సర్పంచ్ స్థానాలకు, 243 వార్డ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. సాయంత్రానికి ఫలితాలు వచ్చాయి. పార్టీ గుర్తు లేకుండా జరిగిన ఎన్నికలు కాబట్టి విజేతల గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మాల్సిందే. దీంతో రెండు పార్టీలు గెలుపు తమదేనని చంకలు గుద్దుకుంటున్నాయి. టీడీపీదే గెలుపు - ప్రజల్లో మార్పు అంటూ ఆ పార్టీ అనుకూల మీడియా బాకాలూదుతోంది, వైసీపీదే విజయం - మారని ప్రజల నమ్మకం అంటూ సాక్షి మీడియా కథనాలిచ్చింది. ఇంతకీ ఏం నమ్మాలి..? ఎవరిని నమ్మాలి..?


ఏపీలో కొంతమంది సర్పంచులు, వార్డు సభ్యులు మరణించడం, మరి కొందరు రాజీనామాలు చేయడం వంటి కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా 64 సర్పంచి, 1,001 వార్డు సభ్యుల స్థానాలకు ఉపఎన్నికలు చేపట్టారు. ఈ నెల 6న నోటిఫికేషన్‌ విడుదల కాగా.. అధికార పార్టీకి 30 సర్పంచి, 756 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 34 సర్పంచి స్థానాలకు, 243 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండు వార్డు స్థానాలకు ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో ఎన్నికలు జరగలేదు. ఈ దశలో ఫలితాల విశ్లేషణ మాత్రం మరీ విచిత్రంగా ఉంది. మార్పు మొదలైందని టీడీపీ సంబరాలు చేసుకుంటుంటే.. వైసీపీ కూడా గెలుపు తమదేనని చెప్పుకోవడం విశేషం.

ఇంతకీ గెలిచింది ఎవరు..?

అధికార పార్టీకే మళ్లీ అధిక స్థానాలు దక్కాయి. ఏకగ్రీవాలతో కలిపి చూస్తే గతంలో స్థానిక ఎన్నికల ఫలితాలే రిపీటయ్యాయి. అయితే వైనాట్ 175 అంటున్న వైసీపీకి టీడీపీ, జనసేన ఉనికి ఓ హెచ్చరిక అని చెప్పుకోవాలి. చీరాల వంటి నియోజకవర్గాల్లో వైసీపీలోని గ్రూపు రాజకీయాలు రోడ్డునపడ్డాయి. బూతు పురాణం, కొట్లాటలు పార్టీ పరువు తీశాయి. టీడీపీకి అవకాశమివ్వకుండా వైసీపీ నేతలే కొట్టుకున్నారు. మరికొన్ని చోట్ల వైసీపీ మద్దతుదారులకు పోటీగా రెబల్స్ బరిలో దిగారు. వారిని టీడీపీ ఖాతాలో వేయలేం కానీ, వైసీపీ బలపరచిన అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతను గుర్తించాల్సిందే. గతంలో వైసీపీ గెలిచిన 8 స్థానాలు ఈసారి టీడీపీ మద్దతుదారులకు దక్కడం విశేషం. అయితే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రెండు పార్టీలు గెలుపు తమదేనని చెప్పుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

First Published:  20 Aug 2023 2:06 AM GMT
Next Story