Telugu Global
Andhra Pradesh

గెజిటెడ్ తో నాన్ గెజిటెడ్.. ఏపీలో ఒకటే అసోసియేషన్

తమ ఎన్జీవో సంఘంలోని నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు చాలా వరకు గెజిటెడ్‌ అయిపోయాయని, అందుకే గెజిటెడ్‌ ను కూడా తమ సంఘంలో చేర్చి పేరు మార్చినట్టు తెలిపారు నేతలు. ఇకపై AP NGGOగా తమ సంఘం కొనసాగుతుందని చెప్పారు.

గెజిటెడ్ తో నాన్ గెజిటెడ్.. ఏపీలో ఒకటే అసోసియేషన్
X

సహజంగా ఉద్యోగ సంఘాల్లో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అసోసియేషన్లు ఉంటాయి. గెజిటెడ్ హోదా పెద్దదే అయినా, సంఖ్యా బలం నాన్ గెజిటెడ్ యూనియన్లలోనే ఉంటుంది. అందుకే ఎన్జీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు ప్రభుత్వం దగ్గర పలుకుబడి ఉంటుంది. అయితే ఏపీలో ఇప్పుడు రెండు యూనియన్లు ఒకటే అవుతున్నాయి. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్ అసోసియేషన్‌(AP NGO) ఇకపై ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌, గెజిటెడ్‌ ఆఫీసర్స్ అసోసియేషన్‌(AP NGGO) గా మారుతోంది. ఈమేరకు బైలాస్ లో మార్పు చేసినట్టు తెలిపారు ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు.

ఎందుకీ మార్పు..?

తమ ఎన్జీవో సంఘంలోని చాలా నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు గెజిటెడ్‌ అయిపోయాయని, అందుకే గెజిటెడ్‌ ను కూడా తమ సంఘంలో చేర్చి పేరు మార్చినట్టు తెలిపారు నేతలు. ఇకపై AP NGGOగా తమ సంఘం కొనసాగుతుందని చెప్పారు. ఏపీలోని 26 జిల్లాల్లో 250 పోస్టులు మహిళలకు కేటాయించామన్నారు. సంఘంలో మెంబర్‌ షిప్‌ అధికం కావడంతో పోస్టులను పెంచుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర కార్యవర్గంలో 5 పోస్టులు, జిల్లాల్లో 2, తాలూకాల్లో 2 పోస్టులను పెంచుతున్నట్టు చెప్పారు. AP NGGO 26 బ్రాంచీలుగా మారుతుందన్నారు.

నేటితో మహాసభల ముగింపు..

రెండురోజులపాటు విజయవాడలో జరుగుతున్న ఏపీ ఎన్జీవో 21వ రాష్ట్ర మహాసభలు ఈరోజుతో ముగుస్తాయి. మహాసభకు రాష్ట్రం నలుమూలల నుంచి 30వేలమంది ఉద్యోగులు హాజరయ్యారని చెబుతున్నారు. సీఎం జగన్ ఈ మహాసభలను ప్రారంభించారు. ఈరోజు మహాసభల ముగింపు సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు.

First Published:  22 Aug 2023 2:50 PM GMT
Next Story