Telugu Global
Andhra Pradesh

కళ్ల డాక్టర్‌కి చూపించుకో.. లోకేష్‌పై రోజా సెటైర్లు..

సీఎం జగన్ చూసి కంపెనీలు పారిపోతున్నాయని లోకేష్ తప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని మండిపడ్డారు రోజా. ప్రజలు పప్పును నమ్మే పరిస్థితి లేదని, ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పారామె.

కళ్ల డాక్టర్‌కి చూపించుకో.. లోకేష్‌పై రోజా సెటైర్లు..
X

నారా లోకేష్‌పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి రోజా. సీఎం జగన్ కొత్తగా ఏ పరిశ్రమ ప్రారంభించినా.. వెంటన లోకేష్ అది తమ బాబోరి హయాంలో వచ్చిందేనంటున్నారని, తింగరోడైన పప్పు కూడా సీఎం పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు రోజా. సీఎం జగన్ పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేస్తూ పారదర్శక పాలన సాగిస్తున్నామని చెప్పారు రోజా. సర్వే ఏదైనా, గెలుపు మాత్రం సీఎం జగన్‌దేనని అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె చంద్రబాబు, లోకేష్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు.

సీఎం జగన్ చూసి కంపెనీలు పారిపోతున్నాయని లోకేష్ తప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని మండిపడ్డారు రోజా. ప్రజలు పప్పును నమ్మే పరిస్థితి లేదని, ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పారామె. ఇటీవల అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటు చేసిన ఏటీసీ కంపెనీ, ఏపీలో సానుకూల వాతావరణం ఉందని చెప్పిందని, సీఎం జగన్ సమర్థతను కంపెనీ ప్రతినిధులు కొనియాడారని చెప్పారు రోజా. రాష్ట్ర ప్రభుత్వం సహకారం బాగుందని, మా లాంటి వాళ్లకు ఏపీ సరైన వేదిక అంటూ ఆయా కంపెనీల ప్రతినిధులు ఇచ్చే స్టేట్‌మెంట్స్‌ లోకేష్‌కి వినపడటంలేదా అని ప్రశ్నించారు రోజా. అదానీ, అంబానీ, అపాచీ వంటి మరెన్నో కంపెనీలు ఏపీలో పరిశ్రమలు పెడుతున్నాయని గుర్తు చేశారు. ఇలాంటివేవీ పప్పుకి కనపడటంలేదంటే.. అతని కళ్లకు ఏదో మాయరోగం వచ్చిందని ఆయన వెంటనే కళ్ల డాక్టర్‌కి చూపించుకోవాలని సెటైర్లు వేశారు.

ఆ బుర్రకు ఈ ఐడియాలు ఎందుకు తట్టలేదు..

వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితాలను చూసి టీడీపీ నేతలు ఏడుస్తున్నారని, చంద్రబాబు బుర్రకు అప్పుడు ఒక్క సంక్షేమ పథకం కూడా ఎందుకు తట్టలేదని ప్రశ్నించారు. పేదల పక్షాన ఆలోచించే మహా నేతలు వైఎస్ఆర్, జగన్ అని అందుకే పథకాలన్నీ వారికే స్ఫురణకు వచ్చాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్ష స్థానాన్ని కూడా కోల్పోతుందన్నారు రోజా. చివరికి కుప్పం, మంగళగిరిలో కూడా టీడీపీని పట్టించుకునేవారే లేరని అన్నారు.

First Published:  18 Aug 2022 7:19 AM GMT
Next Story