Telugu Global
Andhra Pradesh

బాబు ఆర్థిక నేరాల‌పై ఈడీ జోక్యం చేసుకోవాలి.. - ఏపీ మంత్రుల డిమాండ్‌

చంద్ర‌బాబు, లోకేశ్ అత్యంత అవినీతిప‌రుల‌ని, ఇలాంటి గ‌జ‌దొంగ‌ల‌కు అధికార‌మిస్తే.. రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేస్తార‌ని మంత్రి ధ‌ర్మాన విమ‌ర్శించారు.

బాబు ఆర్థిక నేరాల‌పై ఈడీ జోక్యం చేసుకోవాలి.. - ఏపీ మంత్రుల డిమాండ్‌
X

ఐటీ నోటీసులపై చంద్ర‌బాబు ఎందుకు స్పందించ‌డం లేదంటూ ఏపీ మంత్రులు ప్ర‌శ్నించారు. మంత్రులు ధ‌ర్మాన‌, రోజా, గుడివాడ అమ‌ర్‌నాథ్‌, మాజీ మంత్రి కొడాలి నాని బాబుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోమ‌వారం వేర్వేరుగా మీడియాతో మాట్లాడిన నేత‌లు చంద్రబాబు ఆర్థిక నేరాల విషయంలో ఈడీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

పీఏ శ్రీనివాస్ చంద్రబాబు ఆర్థిక నేరాలను స్పష్టంగా ఐటీ అధికారులకు వివరించాడని మంత్రి అమ‌ర్‌నాథ్ తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో చంద్రబాబు అధికారులను, మంత్రివర్గాన్ని తప్పుదోవ పట్టించి సుమారు రూ.350 కోట్లు కొట్టేశాడని ఆయన వివరించారు. దుబాయ్ నుంచి కూడా అక్కడి కరెన్సీలో రూ.15 కోట్ల వరకు దండుకున్నారని మంత్రి ఆరోపించారు. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవిత‌మంతా కుట్ర‌లు, కుతంత్రాలు, అవినీతితో నిర్మిత‌మైంద‌ని మంత్రి అమ‌ర్‌నాథ్ విమ‌ర్శించారు. తాను నిజాయితీ ప‌రుడిన‌ని నీతివ‌చ‌నాలు వ‌ల్లించే చంద్ర‌బాబు రూ.118 కోట్లు ఎలా బొక్కేశాడ‌ని నిల‌దీశారు.

చంద్రబాబుకు ఐటీ నోటీసులిస్తే ఎందుకు ఎవరూ నోరు మెదపడం లేదని మంత్రి రోజా తిరుమ‌లలో మీడియాతో మాట్లాడుతూ ప్ర‌శ్నించారు. ఆయన దత్తపుత్రుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎందుకు ట్వీట్ చేయలేదని నిల‌దీశారు. బాబు, లోకేశ్‌ల‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు. పవన్ కళ్యాణ్ ను సైతం సీబీఐ అధికారులు విచారణ చేయాలని రోజా డిమాండ్ చేశారు.



చంద్ర‌బాబు ఇప్పుడు రికార్డుల‌తో స‌హా దొరికిన దొంగ అని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. 2024 ఎన్నిక‌ల్లో ఒక్కో అభ్య‌ర్థికి రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వ‌ర‌కు అయినా ఖ‌ర్చు పెడ‌దామ‌ని ఆయ‌న చెబుతున్నార‌ని వివ‌రించారు. చ‌ట్టాలు, రాజ్యాంగాల‌ను అనుస‌రించి ఎలా డ‌బ్బు దోచుకోవాలో బాబుకు బాగా తెలుస‌ని మండిప‌డ్డారు. ఇప్పుడు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల నుంచి త‌ప్పించుకునేందుకు బీజేపీ నేత‌ల కాళ్లు ప‌ట్టుకుంటున్నాడ‌ని ఎద్దేవా చేశారు.

చంద్ర‌బాబు, లోకేశ్ అత్యంత అవినీతిప‌రుల‌ని, ఇలాంటి గ‌జ‌దొంగ‌ల‌కు అధికార‌మిస్తే.. రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేస్తార‌ని మంత్రి ధ‌ర్మాన విమ‌ర్శించారు. శ్రీ‌కాకుళం జిల్లా కోట‌బొమ్మాళిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట‌డిగే అర్హ‌త కూడా లేద‌ని చెప్పారు. ఇలాంటి వారి విష‌యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు.

*

First Published:  5 Sep 2023 2:10 AM GMT
Next Story