Telugu Global
Andhra Pradesh

యువతను చంద్రబాబు ఆదుకోవడమా..? అది పెద్ద జోక్.. - మంత్రి రోజా

2014 ఎన్నిక‌ల్లో 600 హామీలు ఇచ్చి ఆరు హామీలు కూడా నెరవేర్చని రకం చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి సంతకాలకు విలువ లేకుండా చేశారని మండిపడ్డారు.

యువతను చంద్రబాబు ఆదుకోవడమా..? అది పెద్ద జోక్.. - మంత్రి రోజా
X

టీడీపీ అధికారంలోకి వస్తే యువతను ఆదుకుంటామని చంద్రబాబు చెప్పడం పెద్ద జోక్ అని మంత్రి రోజా అన్నారు. గతంలో కూడా చంద్రబాబు ఇదే విధంగా బాబు వస్తే జాబు వస్తుందని.. ప్రచారం చేశారని, కానీ ఏ జాబులు ఇప్పించలేదన్నారు. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోపై మంత్రి రోజా స్పందించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అమ్మ ఒడి పథకాన్ని ఎగతాళి చేశారని, ఇప్పుడు మళ్లీ ఆ పథకాన్ని తల్లికి వందనం అంటూ ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారని ప్రశ్నించారు.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు ఏనాడూ మహిళలను ఆదుకోలేదని, ఇప్పుడు నెలకు 1500 రూపాయలు ఇస్తానంటే ఎవరూ నమ్మరన్నారు. రైతులకు ఏడాదికి రూ.20,000 అందిస్తామని చంద్రబాబు మభ్యపెడుతున్నారని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఎలా మోసం చేశారో అందరికీ తెలుసన్నారు. మేనిఫెస్టో అంటే చంద్రబాబుకు చిత్తు కాగితంతో సమానమని రోజా విమర్శించారు. మేనిఫెస్టో పేరుతో ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

2014 ఎన్నిక‌ల్లో 600 హామీలు ఇచ్చి ఆరు హామీలు కూడా నెరవేర్చని రకం చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి సంతకాలకు విలువ లేకుండా చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని చెప్పారు. వలంటీర్ల వ్యవస్థతో లబ్ధిదారుల ఇంటికే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. 3,300 చికిత్సలకు ఆరోగ్యశ్రీ అందిస్తున్నది సీఎం జగన్ మాత్రమే అని చెప్పారు.

ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణ పేరుతో ఇబ్బంది పెట్టిందని, వివేకా కేసులో సీబీఐ చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు లేవని జడ్జి చెప్పారన్నారు. ఎల్లో మీడియా ఇష్టానుసారం చర్చలు పెట్టి తప్పుడు ప్రచారం చేసిందని రోజా విమ‌ర్శించారు.

First Published:  31 May 2023 3:08 PM GMT
Next Story