Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు చుట్టూ పేటీఎం బ్యాచ్ లు, భజన బృందాలు..

రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లపాటు సీఎంగా పనిచేసినప్పుడైనా పోలవరం పూర్తి చేసి ఉండొచ్చుకదా అని అడిగారు. పోలవరాన్ని ఏటీఎం కార్డులా వాడుకున్నారని, ఆయన చేసిన పాపం వల్లే ఇప్పుడు ప్రజలు నష్టపోతున్నారని అన్నారు.

చంద్రబాబు చుట్టూ పేటీఎం బ్యాచ్ లు, భజన బృందాలు..
X

చంద్రబాబు చుట్టూ ఇంకా పేటీఎం బ్యాచ్ లు, భజన‌ బృందాలు ఉన్నాయని, ఆయనకు అలా భజనలు చేయించుకోవడం, చేయించడం అలవాటని విమర్శించారు మంత్రి రోజా. పోలవరం కట్టకుండానే బస్సు యాత్రల పేరుతో రాష్ట్ర నలుమూలల నుంచి పేటీఎం బ్యాచ్ ని తీసుకెళ్లి జయము జయము చంద్రన్న అంటూ భజనలు చేయించారని ఎద్దేవా చేశారు. అయితే అందరూ చంద్రబాబులాగా భజనలు చేయించుకుంటారని అనుకోవడం ఆయన పిచ్చితనం అంటూ విమర్శించారు.

అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు బాబూ..

అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం గురించి బాబు ఆలోచించలేదని, రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, అప్పుడు రాష్ట్రాన్ని అప్పుల్లో‌ ముంచి.. ఇప్పుడు అది చేస్తా, ఇది చేస్తానంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ మండిపడ్డారు రోజా. గతంలో 14ఏళ్లపాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పోలవరం కట్టకుండా గాడిదలు కాశారా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లపాటు సీఎంగా పనిచేసినప్పుడైనా పోలవరం పూర్తి చేసి ఉండొచ్చుకదా అని అడిగారు. పోలవరాన్ని ఏటీఎం కార్డులా వాడుకున్నారని, ఆయన చేసిన పాపం వల్లే ఇప్పుడు ప్రజలు నష్టపోతున్నారని అన్నారు.

కుప్పంను మున్సిపాల్టీ చేసుకోలేని బాబు..

కుప్పంను మున్సిపాలిటీ, కనీసం రెవెన్యూ డివిజన్ చేసుకోలేని చంద్రబాబు పోలవరం ముంపు మండలాలను జిల్లా చేస్తానని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు రోజా. వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా 2 వేల రూపాయలు అందించిన ఘనత సీఎం జగన్ ది అని చెప్పారు. జగన్ పై ఆయా కుటుంబాలు చూపిన అభిమానం తట్టుకోలేక చంద్రబాబు పేటీఎం బ్యాచ్ తో విమర్శలు చేయిస్తున్నారని అన్నారు రోజా. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్న కోరుకున్న విధంగా రాష్ట్రాన్ని‌ అభివృద్ధిలో పరుగులు తీయించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.

First Published:  1 Aug 2022 5:24 AM GMT
Next Story