Telugu Global
Andhra Pradesh

బాబుకు చిత్త‌శుద్ధి ఉంటే.. టీడీపీని నంద‌మూరి కుటుంబానికి ఇవ్వాలి - మంత్రి కాకాణి

రెండు, మూడ్రోజులుగా చూస్తే టీడీపీ నాయకులు ఇచ్చే స్టేట్‌మెంట్లు చాలా దారుణంగా ఉన్నాయని కాకాణి చెప్పారు. దీనికి ప్రధాన కారణం కుప్పం పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అక్కడ ప్రజలు ఘన స్వాగతం పలకడాన్ని చూసి ఓర్వలేకపోవ‌డ‌మేన‌ని తెలిపారు.

బాబుకు చిత్త‌శుద్ధి ఉంటే.. టీడీపీని నంద‌మూరి కుటుంబానికి ఇవ్వాలి - మంత్రి కాకాణి
X

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడుకు చిత్త‌శుద్ధి ఉంటే.. టీడీపీని నంద‌మూరి కుటుంబానికి ఇవ్వాల‌ని.. ఆ పార్టీ కేడ‌ర్‌, ప్ర‌జ‌లు కోరుకుంటున్న‌ది అదేన‌ని ఏపీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఆదివారం నెల్లూరులో ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు.

గత రెండు, మూడ్రోజులుగా చూస్తే టీడీపీ నాయకులు ఇచ్చే స్టేట్‌మెంట్లు చాలా దారుణంగా ఉన్నాయని కాకాణి చెప్పారు. దీనికి ప్రధాన కారణం కుప్పం పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అక్కడ ప్రజలు ఘన స్వాగతం పలకడాన్ని చూసి ఓర్వలేకపోవ‌డ‌మేన‌ని తెలిపారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నడూ లేనివిధంగా జగన్‌ సీఎం హోదాలో వెళితే కుప్పం ప్రజలు నీరాజనాలు పలికారని, దాన్ని జీర్ణించుకోలేక టీడీపీ నాయకులు ఫ్రస్ట్రేషన్‌తో రకరకాల విమర్శలు చేయడం దురదృష్టకరమ‌ని ఆయ‌న చెప్పారు.

చంద్రబాబు నాయుడు దాదాపు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా కుప్పం అభివృద్ధికి చేసిందేమీ లేదని, కానీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని కుప్పంతో సహా రాష్ట్ర ప్రజలందరికీ రుచి చూపించారని మంత్రి చెప్పారు. ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గం అన్న వివక్ష చూపకుండా జగన్‌ మోహన్‌ రెడ్డి తన సొంత నియోజకవర్గాన్ని ఏవిధంగా చూసుకున్నారో.. ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని కూడా అలాగే అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. దీనిని గ్రహించిన కుప్పం ప్రజలు కృతజ్ఞతా భావంతో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సభకు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు. దీంతో ఇంతకాలం టీడీపీ వాళ్లు ఇష్టం వచ్చినట్లు అల్లిన కట్టు కథలన్నీ ఈ దెబ్బతో తుడిచిపెట్టుకుపోయాయన్నారు. కుప్పంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో మంజూరయిందేన‌ని మంత్రి కాకాణి గుర్తుచేశారు.

కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి ముఖ్యమంత్రిగా ఏమీ చేయలేకపోయిన చంద్రబాబు చివరకు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్‌ చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కి లేఖ రాశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటే త‌న‌కు సిగ్గేస్తోందని కాకాణి ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయ ఉగ్రవాది అని, ఆయ‌న‌ది టెర్రరిస్ట్‌ మెంటాలిటీ అని కాకాణి మంత్రి విమ‌ర్శించారు. ఆయన నిద్ర లేచింది మొదలు మళ్ళీ నిద్రపోయేవరకు తాను ఏం కుట్రలు చేస్తే నాలుగు ఓట్లు పడతాయి అనే ఆలోచనే తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోడన్నారు.

గుడివాడలో మ‌హిళ‌ల‌తో తొడలు కొట్టిస్తే ఏం వస్తుందని ఈ సంద‌ర్భంగా కాకాణి ప్ర‌శ్నించారు. కుప్పంలో జరిగిన అవమానాన్ని గుడివాడలో తీర్చుకోవాలనే దుర్మార్గమైన ఆలోచనే చంద్ర‌బాబులో కనిపించింద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న చెప్పారు. రాజకీయంగా ఎప్పుడో దిగజారిపోయిన చంద్రబాబు ఇవాళ నైతికంగా కూడా దిగజారిపోయారనేందుకు ఇదో ఉదాహరణని ఆయ‌న తెలిపారు.

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్చామని రాద్ధాంతం చేస్తున్న చంద్ర‌బాబు.. ఆరోగ్యశ్రీ పేరు ఎందుకు తొలగించాడో చెప్పాల‌ని మంత్రి డిమాండ్ చేశారు. ఆరోగ్య‌శ్రీ‌లో వైద్య సేవలను ఎందుకు తగ్గించాడో చెప్పాల‌ని సూటిగా ప్రశ్నించారు. 108 వైద్య సేవలను అటకెక్కించింది నీవు కాదా బాబూ? వాటన్నిటి పేర్లు తొలగించింది, పేర్లు మార్చింది నువ్వు కాదా? అని నిల‌దీశారు.

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాక, టీడీపీ సభ్యత్వం పుస్తకాల మీద ఎన్టీ రామారావు ఫోటో ఉండేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడలేదని కాకాణి గుర్తు చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడమే కాకుండా చివరకు ఘోర అవమానం చేశాడని, ఇవాళ ఎన్టీఆర్ పై మొసలి కన్నీరు కార్చితే ప్రజలు గమనించరనుకుంటున్నారా అని నిల‌దీశారు.

ఏ వ్యక్తి అయితే ఆ రంగాల్లో విశేష కృషి చేస్తారో ఆ వ్యక్తుల పేరును పథకాలకు పెట్టుకోవడం ఆనవాయితీ అని మంత్రి కాకాణి స్ప‌ష్టం చేశారు. చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, ఆయన చావుకు కారణమైతే, ఆ వ్యక్తి పేరును జ‌గ‌న్‌ శాశ్వతంగా ఒక జిల్లాకు పెట్టారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ పట్ల అభిమానం ఉంది కాబట్టే ఆయన పేరుతో జిల్లా పెట్టామ‌ని, ఎన్టీ రామారావు పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ది ఏమిటో ప్రజలకు తెలుసున‌ని ఆయ‌న చెప్పారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్‌కు కూడా ఆ విష‌యం తెలుస‌న్నారు.

అమరావతి యాత్రకు కథ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం.. చివ‌ర‌కు నిర్మాత కూడా బాబేన‌ని మంత్రి చెప్పారు. ఆడవాళ్లతో తొడలు కొట్టించే నీచ సంస్కృతి ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? చంద్రబాబుకు కావాల్సింది వివాదాలు... అల్లర్లు, గొడవలు.. ఏదోవిధంగా రెచ్చగొట్టి గొడవలు సృష్టించడమే లక్ష్యం.. రాష్ట్రం సుభిక్షంగా, శాంతియుతంగా ఉండకూడదనేది ఆయన ఆలోచన.. అంటూ మంత్రి మండిపడ్డారు. రైతుల ప్రయోజనాల గురించి ఆలోచించని వ్యక్తి ఇవాళ వాళ్ల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

రాజధాని రైతులే ఆ యాత్రలో ఉంటే మంగళగిరిలో నీ సుపుత్రుడు ఎందుకు ఓడిపోయాడు బాబూ..? అని మంత్రి నిల‌దీశారు. మీ పాలన మీద వ్యతిరేకత తోనే అక్కడ నీ పుత్రుడిని ఘోరంగా ప్రజలు ఓడించారంటూ ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు తనకు వ్యతిరేకంగా ఉన్నారని అప్పుడైనా చంద్రబాబుకు అర్థం కావాలి కదా? అని ప్ర‌శ్నించారు.

వైద్యరంగానికి విశేషమైన సేవలు అందించిన నాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి.. ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌ మోహన్‌ రెడ్డి.. వారి నేతృత్వంలో జరిగిన అభివృద్ధికి గుర్తుగా, భవిష్యత్‌ తరాలు మాట్లాడుకునే విధంగా ఆలోచన చేసి హెల్త్‌ యూనివర్శిటీకి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరు పెట్టారు.. అంటూ మంత్రి వివ‌రించారు.

చంద్రబాబు నాయుడు బతికున్నంతవరకూ నారా కుటుంబమే తప్ప.. నందమూరి కుటుంబం బయటకు రాదని మంత్రి కాకాణి స్ప‌ష్టం చేశారు. ఇది జగమెరిగిన సత్యమ‌ని ఆయ‌న చెప్పారు. జై జూనియర్‌ ఎన్టీఆర్‌ అని పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తుంటే.. నోరుముయ్యమని చంద్రబాబు అంటున్నాడని విమ‌ర్శించారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే.. టీడీపీని నందమూరి కుటుంబానికి ఇవ్వాలని ప్రజలతో పాటు టీడీపీ క్యాడర్‌ కూడా కోరుకుంటోంద‌ని మంత్రి తెలిపారు.

First Published:  25 Sep 2022 11:31 AM GMT
Next Story