Telugu Global
Andhra Pradesh

ఈనాడు ఈ కుల ప్రాధాన్యత ఏంటి?

కులం పేరుతో విషం చిమ్ముతున్నామని మాపై నిందలు వేస్తున్న రామోజీరావు మరి తన పత్రికలో చిమ్మిన రంగును ఏమనాలి అని మంత్రి జోగి ర‌మేష్‌ ప్రశ్నించారు.

ఈనాడు ఈ కుల ప్రాధాన్యత ఏంటి?
X

`అమరావతి మీద కులం ముద్ర వేస్తున్నారని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు.. చెరుకూరి రామోజీరావే తన ఈనాడు పత్రికలోనే ఈ ఉద్యమం మా కులం వాళ్లది అని స్పష్టం చెబుతున్నారు` అని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ఏ కులం వారికి ప్రాధాన్యత ఇస్తున్నారో చూడాలంటూ ఈనాడు పత్రికలో వరుసగా ఒకే సామాజికవర్గం వారి అభిప్రాయాలను ప్రచురించిన విధానాన్ని జోగి రమేష్ ప్రస్తావించారు.

ఈనాడు పేపర్‌లో వరుసగా సీపీఐ నారాయణ, రేణుకా చౌదరి, చింతమనేని ప్రభాకర్ చౌదరి, దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్ చౌదరి, పాతూరి నాగభూషణం అభిప్రాయాలను ప్రచురించారని.. వీరంతా ఒకే సామాజికవర్గం కాదా అని ప్రశ్నించారు. తామెన్నడూ కులం పేరు ఎత్తలేదని.. కానీ, వీరే వీరి పత్రికల్లో అమరావతి తమ కులానిదే అని ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.

కులం పేరుతో విషం చిమ్ముతున్నామని మాపై నిందలు వేస్తున్న రామోజీరావు.. మరి తన పత్రికలో చిమ్మిన రంగును ఏమనాలి అని మంత్రి జోగి ర‌మేష్‌ ప్రశ్నించారు. ఇప్పుడు చేస్తున్నది అమరావతి యాత్ర కాదని.. టీడీపీ శవయాత్ర అని విమర్శించారు. 40 దేవాల‌యాలు పడగొట్టిన చంద్రబాబు డైరెక్షన్‌లో ఇప్పుడు అమరావతి రథం అంటూ ఊరేగుతున్నారని మండిపడ్డారు.

తండ్రి వారసత్వం కాకుండా, అత్తింటివారి వారసత్వం చెప్పుకుని బతుకుతున్న వ్యక్తులు చంద్రబాబు, నారా లోకేష్ అని విమర్శించారు. జగన్‌ గురించి గానీ, జగన్ కుటుంబసభ్యుల గురించి గానీ నోరు జారితే నాలుక చీలుస్తామని వార్నింగ్ ఇచ్చారు. అమరావతి వాదులు చేస్తున్న పాదయాత్ర ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలపై చేస్తున్న దండయాత్ర అని విమర్శించారు. ఇటీవల చంద్రబాబు ఇంటి మీదకే తాను వెళ్లానని.. అప్పుడు నా ఇంటి మీదకే వస్తారా అని ఏడ్చారని.. మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే వదిలిపెట్టబోమని.. తాట తీస్తామన్నారు. పాదయాత్రలో అసలు బౌన్సర్లతో పనేంటని ప్రశ్నించారు. రాష్ట్ర సంపద మొత్తం తెచ్చి అమరావతిలోనే పెట్టాలా.. చంద్రబాబు సామాజికవర్గం వారు మాత్రమే బాగుపడాలా అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు.

First Published:  13 Sep 2022 1:22 PM GMT
Next Story