Telugu Global
Andhra Pradesh

ఆయన పెద్ద కట్టప్ప.. ఈయన చిన్న కట్టప్ప

రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి గుడివాడ అమ‌ర్ విమర్శించారు.

ఆయన పెద్ద కట్టప్ప.. ఈయన చిన్న కట్టప్ప
X

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌లపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సెటైర్లు వేశారు. ఇంతకీ అవేంటంటే.. వెన్నుపోట్లు పొడ‌వ‌డంలో చంద్రబాబు నాయుడు పెద్ద కట్టప్ప అయితే.. నాదెండ్ల మనోహర్‌ చిన్న కట్టప్ప అని అన్నారు. ఎన్టీఆర్‌కి చంద్రబాబు వెన్నపోటు పొడిస్తే.. పవన్‌ కల్యాణ్‌కి మనోహర్‌ వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన విమర్శించారు. అందుకే బాబును పెద్ద కట్టప్పతో, మనోహర్‌ని చిన్న కట్టప్పతో పోల్చారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టునే జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ చదువుతున్నారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. విశాఖపట్నంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి గుడివాడ అమ‌ర్ విమర్శించారు. టీడీపీ పాలనలో జీఎస్డీపీ 22వ స్థానంలో ఉండగా, నేడు ఒకటో స్థానంలో ఉందని మంత్రి వివరించారు. జీఎస్డీపీ అనేది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చేదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. టీడీపీ హయాంలో తలసరి ఆదాయం విషయంలో రాష్ట్రం 174వ స్థానంలో ఉండగా.. నేడు తొమ్మిదో స్థానానికి చేరిందని తెలిపారు.

వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమల ద్వారా లక్షా 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. ఎంఎస్‌ఎంఈల ద్వారా 13 లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. టీడీపీ పాలనలో వ్యవసాయం రంగంలో 27వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. నేడు ఆరో స్థానానికి చేరిందని తెలిపారు. అలాగే పారిశ్రామిక అభివృద్ధిలో టీడీపీ హయాంలో 22వ స్థానంలో ఉంటే.. నేడు మూడో స్థానానికి చేరిందని వివరించారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంఎస్‌ఎంఈలకు పెద్దపీట వేశారన్నారు. గత ప్రభుత్వం కన్నా ఎంఎస్‌ఎంఈ రంగంలో 650 శాతం వృద్ధి సాధించినట్టు చెప్పారు. మొన్న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు సీఎం జగన్‌ క్లియరెన్స్‌ ఇచ్చారని వివ‌రించారు. ప్ర‌స్తుత‌మున్న 6 పోర్టులకు అదనంగా మరో 4 పోర్టులు నిర్మిస్తున్నట్టు చెప్పారు. 10 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నామన్నారు. పోర్ట్‌ ఆధారిత పరిశ్రమలు తీసుకువస్తున్నామని, మూడు ఇండస్ట్రియల్‌ కారిడార్లు మన రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు.

First Published:  16 Nov 2023 7:51 AM GMT
Next Story