Telugu Global
Andhra Pradesh

గుడ్డు విషయంలో హర్ట్ అయిన గుడివాడ..

మంత్రి గుడివాడ నోటి నుంచి గుడ్డు అనే మాట రావడంతో సోషల్ మీడియాకి అది విందు భోజనంగా మారింది. గుడ్డు విషయంలో గుడివాడ నొచ్చుకున్నారని, అందుకే మరోసారి కోడిగుడ్డు ఉపమానం వాడారని అంటున్నారు.

గుడ్డు విషయంలో హర్ట్ అయిన గుడివాడ..
X

ఏపీ రాజధాని విషయంలో ప్రతిపక్షాలు, ప్రతిపక్ష మీడియా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నాయని మండిపడ్డారు ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సహజంగా రాజకీయ విమర్శల్లో ఆ ఉపమానం తరచూ వినిపించేదే. కానీ మంత్రి గుడివాడ నోటి నుంచి గుడ్డు అనే మాట రావడంతో సోషల్ మీడియాకి అది విందు భోజనంగా మారింది. గుడ్డు విషయంలో గుడివాడ నొచ్చుకున్నారని, అందుకే మరోసారి కోడిగుడ్డు ఉపమానం వాడారని అంటున్నారు. మొత్తమ్మీద మంత్రి గుడివాడ సమాధానం సరికొత్త ట్రోలింగ్ కి కారణం అయింది.

హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా-ఇ రేసు సందర్భంగా ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏపీ పరిస్థితిని వివరించే క్రమంలో ఆయన కోడి, కోడుగుడ్డు అనే స్టోరీ చెప్పారు. కోడిపెట్ట నేరుగా కోడిని పెట్టదని, గుడ్డుని మాత్రమే పెడుతుందని, ఆ గుడ్డు పొదిగిన తర్వాత పిల్లవుతుందని, పెరిగి పెద్దదై కోడిగా మారుతుందని సోదాహరణంగా వివరించారు. అక్కడే ఆయన సోషల్ మీడియాకి అడ్డంగా బుక్కయ్యారు. గుడివాడ గుడ్డు స్టోరీ అంటూ ఓ రేంజ్ లో ఆయనపై ట్రోలింగ్ జరిగింది. గతంలో కూడా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తో పోలుస్తూ ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై సెటైర్లు పేలేవి. ఫార్ములా-ఇ రేసు సందర్భంగా మరోసారి ఆ సెటైర్లు గుడ్డు కారణంగా హైలెట్ అయ్యాయి.

తాజాగా మంత్రి మరోసారి కోడిగుడ్డు వ్యాఖ్యలు చేయడం విశేషం. అయితే ఈసారి సందర్భం వేరు. కేవలం రాజధాని విషయంలో ప్రతిపక్షాలను విమర్శించేందుకే ఆయన ఆ పదప్రయోగం చేశారు. మూడు రాజధానులు అంటే పరిపాలన అన్నిచోట్లనుంచి జరగదు కదా అని ప్రశ్నించారు మంత్రి. విశాఖ పాలనా రాజధాని కాబట్టి, అదే రాజధాని అని బుగ్గన ప్రకటించారని వివరించారు. ఆయన ఫ్లోలో అన్న మాటను పట్టుకుని కోడిగుడ్డుపై ఈకలు పీకడం దేనికన్నారు. ఆయన నోటినుంచి ఆ మాట రాగానే మీడియా సోదరులు కూడా సరదాగా నవ్వారు, మంత్రి అమర్నాథ్ కూడా నవ్వుతూ నిష్క్రమించారు. కోడిగుడ్డు, కోడిపెట్ట అంటూ మంత్రి గుడివాడ చెప్పిన పిట్టకథ.. సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతోంది.

First Published:  16 Feb 2023 3:00 PM GMT
Next Story