Telugu Global
Andhra Pradesh

వర్షంలో తారు రోడ్డా..!? - మంత్రి ధర్మాన విస్మయం

బ్రిటిష్‌ హయాంలో చేసిన నిర్మాణాలు ఇప్పటికీ బాగానే ఉన్నాయని.. ఇప్పుడు ఇంజనీర్లు కట్టే భవనాలు ఎన్ని రోజులు ఉంటాయో కూడా తెలియడం లేదన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

వర్షంలో తారు రోడ్డా..!? - మంత్రి ధర్మాన విస్మయం
X

ఇంజనీరింగ్ విభాగంపై రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ఇంజనీరింగ్ విభాగం తీరు మారాల్సిన అవసరం ఉందన్నారు. వంశధార ప్రాజెక్టు లైనింగ్ పూర్తి చేయాల్సి ఉన్నా.. ఇంజనీర్లు సకాలంలో అందుబాటులో ఉండడం లేదన్నారు. సెక్షన్ ఆఫీసర్ ఇక్కడ ఉద్యోగం చేస్తూ విశాఖలో ఉంటే ఎలా అని ప్రశ్నించారు. విశాఖలో ఉంటూ ఉద్యోగాలు చేస్తామంటే కుదరదని అలాంటి వారి జాబితాను తీసి ప్రభుత్వానికి సరెండర్ చేస్తామన్నారు.

బ్రిటిష్‌ హయాంలో చేసిన నిర్మాణాలు ఇప్పటికీ బాగానే ఉన్నాయని.. ఇప్పుడు ఇంజనీర్లు కట్టే భవనాలు ఎన్ని రోజులు ఉంటాయో కూడా తెలియడం లేదన్నారు. ఇప్పటి ఇంజనీర్లు రోడ్లు వేస్తే మధ్యలో నీరు నిలబడుతోందన్నారు. ఇలాంటి పనితీరుతో భావితరాలకు అన్యాయం చేసిన వారు కావొద్దని సలహా ఇచ్చారు.

ఇటీవల ఆర్‌ అండ్ బీ అధికారులు ఒకవైపు వర్షం పడుతుండగానే తారు రోడ్లు నిర్మాణం చేశారని, దాన్ని చూసి ఒక సర్పంచ్‌ తనకు ఫోన్ చేశారని, దాంతో తాను జేఈకి ఫోన్ చేస్తే బుర్ర తిరిగే సమాధానం వచ్చిందని మంత్రి ధర్మాన చెప్పారు. వర్షం పడుతున్నప్పుడు తారు రోడ్డు వేయకూడదని సర్పంచ్‌కు ఉన్న జ్ఞానం ఇంజనీరింగ్ అధికారులకు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇంజనీరింగ్‌ కీలక అధికారి ఎక్కడో హైదరాబాద్‌లో ఉంటున్నారని.. ఆయన వారంలో నాలుగు రోజులు మాత్రమే వస్తాడని.. ఇలా అయితే ఈ దేశం, రాష్ట్రం మరో వందేళ్లు అయినా బాగుపడదన్నారు.

అధికారుల తీరుపై మంత్రి బొత్స కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులకు హెచ్‌ఆర్ ఇస్తున్నా.. ఉండాల్సిన చోట ఉండకుండా మరో చోట ఉండడం ఏమిటని ప్రశ్నించారు. అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కలెక్టర్‌కు మంత్రి బొత్స ఆదేశించారు. వర్షంలో తారు రోడ్డు వేస్తే ఎలా అని బొత్స కూడా ప్రశ్నించారు. శ్రీకాకుళం జెడ్పీ కార్యాలయంలో ఇన్‌చార్జ్ మంత్రి బొత్స ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రులు ఈ వ్యాఖ్యలు చేశారు.

First Published:  10 Sep 2022 4:44 AM GMT
Next Story