Telugu Global
Andhra Pradesh

పవన్ ఫిట్ నెస్‌ను శంకించిన మంత్రి ధర్మాన..

మాటిచ్చి నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్ అని, కేవలం మాటల మనిషిగా పవన్ నిలిచిపోయారని, ఆయన పోస్టర్ లో యువత ఫొటోలు పెట్టుకోవడం ఏంటని మండిపడ్డారు.

పవన్ ఫిట్ నెస్‌ను శంకించిన మంత్రి ధర్మాన..
X

'పవన్ కల్యాణ్ సినిమా హీరో, అంతే కానీ ఆయన రాజకీయ నాయకుడు కాదు, జనం కోసం ఆయన పాదయాత్ర చేయలేరు, జనంలో నడవలేరు. ఆయన్ను కనీసం నాతో 3 కిలోమీటర్లు నడవమనండి చాలు' అంటూ ఎద్దేవా చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. పవన్ కల్యాణ్ కేవలం సినిమా హీరో అని, సీఎం జగన్ రియల్ హీరో అని అన్నారు.

పోస్టర్ లో ఫొటోలు ఏంటి..?

శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని లింగాల వలసలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి సమీపంలోనే పవన్ కల్యాణ్ పోస్టర్ మంత్రికి కనపడింది. ఆ పోస్టర్ పై స్థానిక యువత కూడా తమ ఫొటోలు వేసుకున్నారు. దీంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో మాటలు చెప్పినంత సులువుగా పనులు జరగవన్నారు ధర్మాన. అలా మాటిచ్చి నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్ అని, కేవలం మాటల మనిషిగా పవన్ నిలిచిపోయారని, ఆయన పోస్టర్ లో యువత ఫొటోలు పెట్టుకోవడం ఏంటని మండిపడ్డారు. సినిమా వేరు, నిజ జీవితం వేరు, రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులుంటాయని చెప్పారు.

అధికారంతో సంబంధం లేకుండా 45ఏళ్లు ప్రజాజీవితంలో తాను ఉన్నానని చెప్పారు ధర్మాన ప్రసాదరావు. పవన్ కల్యాణ్ కు రాజకీయ ప్రయాణం సాధ్యం కాదన్నారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయంగా నడుస్తానంటున్నారని, అది సాధ్యమయ్యే పని కాదని చెప్పారు. సినిమాలో బొమ్మలు పెట్టి యాక్షన్‌ చేస్తారు కానీ, నిజ జీవితంలో అలాంటి నటనలు పనికి రావన్నారు. ప్రజా జీవితం అనేది మాటలు చెప్పినంత సులువేం కాదని అన్నారు ధర్మాన.

First Published:  8 Aug 2022 2:30 PM GMT
Next Story