Telugu Global
Andhra Pradesh

హెరిటేజ్ పాల ఫ్యాక్టరీనా..? ఎన్టీఆర్ ట్రస్ట్ భవనా..?

సకాలంలో వరద సాయం అందడం వల్ల వచ్చిన కడుపు మంటతో చంద్రబాబు తన పర్యటనల్లో విషం కక్కు తున్నారని మండిపడ్డారు. భారతీయుడు సినిమాలోని కమల్ హాసన్ మా ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు అంబటి.

హెరిటేజ్ పాల ఫ్యాక్టరీనా..? ఎన్టీఆర్ ట్రస్ట్ భవనా..?
X

పోలవరం కట్టడం చేతకాకపోతే సీఎం పదవినుంచి జగన్ తప్పుకోవాలని, తాను పూర్తి చేసి చూపిస్తానంటూ ఇటీవల సవాళ్లు విసిరారు చంద్రబాబు. అలా పదవినుంచి తప్పుకోడానికి ఇదేమైనా హెరిటేజ్‌ పాల ఫ్యాక్టరీనా? లేక ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనా? బసవ తారకం క్యాన్సర్‌ ఆస్పత్రా? అని ప్రశ్నించారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అలా తప్పుకుంటే ఇలా వచ్చి ఆ ప్లేస్ లో కూర్చోడానికి అదేమీ డైరెక్టర్ పదవి కాదని, సీఎం పదవి అని, ప్రజలు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని తీర్పునిచ్చారని చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు.

బాబుతోనే కరువు. వరదలు..

ఇటీవల వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, తాను వరదల కంటే, గాలివాన కంటే ముందే వస్తానని చెప్పారని, అది నిజమేనని అన్నారు అంబటి. ఆయన వచ్చిన తర్వాతే వరదలు, కరువు లాంటివి వస్తాయని ఎద్దేవా చేశారు. సకాలంలో వరద సాయం అందడం వల్ల వచ్చిన కడుపు మంటతో చంద్రబాబు తన పర్యటనల్లో విషం కక్కు తున్నారని మండిపడ్డారు.

అవును కమల్ హాసనే..?

ఇటీవల కోడి కత్తి కమల్ హాసన్ అంటూ చంద్రబాబు వెటకారం చేస్తున్నారు. దీనికి అంబటి కౌంటర్ ఇచ్చారు. అవును, మా జగన్ కమల్ హాసనే.. దుర్మార్గులు, దుష్టులతో పాటు చంద్రబాబు వంటి ఫోర్‌ ట్వంటీగాళ్ల గొంతు కోసే భారతీయుడు సినిమాలోని కమల్ హాసన్ మా ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు అంబటి.

కరకట్ట నువ్వు కట్టావా..?

గోదావరికి తాను కరకట్ట కట్టడం వల్లే ఇటీవల వరదలకు పెద్ద నష్టం జరగలేదని ఖమ్మం జిల్లా వాసులకు చంద్రబాబు చెబుతున్నారని, భద్రాచలం వద్ద కరకట్టను 1986లో కట్టారని, అప్పటికి చంద్రబాబు కనీసం ఎమ్మెల్యే కూడా కాదు అని విమర్శించారు అంబటి. భద్రాచలంలో కరకట్ట కట్టింది అప్పటి సీఎం ఎన్టీఆర్ అని చెప్పారు. తాజాగా ఇండియా టుడే సర్వేలో కూడా చంద్రబాబు అధికారంలోకి రాలేడని తేలిపోయిందని చెప్పారు.

సెంట్రింగ్ లేకుండా శ్లాబ్ వేశారు..

పోలవరం ఆలస్యం కావడానికి ముమ్మాటికీ చంద్రబాబే కారణం అని అన్నారు అంబటి రాంబాబు. సెంట్రింగ్ లేకుండా శ్లాబ్ వేసినట్టు.. కాఫర్‌ డ్యామ్‌ కట్టకుండా డయాఫ్రమ్‌ వాల్‌ కట్టారని, అందుకే అది కూలిపోయిందని చెప్పారు. ప్రాజెక్టు పనులను సర్వనాశనం చేసింది చంద్రబాబేనన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేని చంద్రబాబు, ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు అంబటి. తన కమీషన్లకోసం కేంద్రం కడతానన్న జాతీయ ప్రాజెక్ట్ ని చంద్రబాబు తీసుకున్నారని, డబ్బులంతా బొక్కేసి, ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని అన్నారు. వరద సాయం విషయంలో కులం, మతం, వర్గం చూడకుండా అందర్నీ ఆదుకున్నామని రాష్ట్రంలో కేవలం చంద్రబాబు, లోకేష్ మాత్రమే సంతోషంగా లేరని చెప్పారు.

First Published:  31 July 2022 1:48 AM GMT
Next Story