Telugu Global
Andhra Pradesh

ఏపీలో అన్ని గేట్లు రిపేర్.. అన్నిటికీ జగనే కారణం అంటే ఎట్లా..?

ఐదేళ్లుగా గత ప్రభుత్వం ప్రాజెక్ట్ ల నిర్వహణను గాలికి వదిలేయడం వల్లే గేట్లు తుప్పుపట్టి పోయాయని చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. గేట్లు తుప్పుపట్టడం, పాడైపోవడం అనేది జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదలు కాలేదని, గతం నుంచీ ఉన్నదేనని చెప్పారు.

ఏపీలో అన్ని గేట్లు రిపేర్.. అన్నిటికీ జగనే కారణం అంటే ఎట్లా..?
X

గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేటు పాడైపోవడం వల్ల 700 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్లిపోయిందని, దీనికి వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఇటీవల విమర్శలు వినిపించాయి. దీనిపై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. ఏపీలోని అన్ని సాగునీటిపారుదల ప్రాజెక్ట్ ల గేట్లు రిపేర్ లోనే ఉన్నాయని చెప్పారాయన. గేట్లు రిపేర్ అనేది వాస్తవమేనని, అయితే వాటన్నింటికీ సీఎం జగనే కారణం అనడం సరికాదన్నారు అంబటి.

గత ప్రభుత్వానిదే తప్పు..

ఐదేళ్లుగా గత ప్రభుత్వం ప్రాజెక్ట్ ల నిర్వహణను గాలికి వదిలేయడం వల్లే గేట్లు తుప్పుపట్టి పోయాయని చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. గేట్లు తుప్పుపట్టడం, పాడైపోవడం అనేది జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదలు కాలేదని, గతం నుంచీ ఉన్నదేనని చెప్పారు. అయితే ఇటీవల కాలంలో ఇలాంటి దుర్ఘటనలు జరగడంతో తప్పంతా తమపై నెట్టివేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారాయన. జగన్ పై అనవసర ఆరోపణలు చేసి లబ్ధిపొందాలని చూస్తే ఉపయోగం లేదన్నారు అంబటి. డ్యాం మరమ్మతులకోసం టీడీపీ ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక పోయిందని, వారు డ్యాంను అశ్రద్ద చేయటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం గుండ్లకమ్మలో ఉన్న 3.4 టీఎంసీల నీటిలో 2 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేయక తప్పని పరిస్థితి ఉందన్నారు. పులిచింతలలో కూరుకుపోయిన గేట్లు రిపేర్ చేయిస్తున్నామని చెప్పారు.

ఏపీలోనీ అన్ని డ్యామ్‌ ల రక్షణ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు అంబటి రాంబాబు. గుండ్లకమ్మ ప్రాజెక్టు విషయానికొస్తే.. నీటి ప్రవాహం అధికంగా ఉండటం వల్ల రెండు రోజుల నుంచి అక్కడ స్టాప్ లాక్ ఏర్పాటు చేయలేక పోయామని చెప్పారు. కొన్ని గేట్లు బాగాలేవని ఇప్పటికే ఇంజినీర్లు నివేదిక ఇవ్వడంతో వాటి మరమ్మతులకోసం అనుమతి ఇచ్చామని చెప్పారు. గేట్లు బాగుచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఐదారేళ్ళ నుండి గేట్లు తుప్పు పట్టడం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు అంబటి. గత ప్రభుత్వం డ్యాం సేఫ్టీ కోసం రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. రాజకీయంగా ఈ విషయాన్ని వాడుకోవాలని చూడటం సరైన పద్ధతి కాదని హితవుపలికారు.

బాబు పూజలు దేనికోసమంటే..?

ఎవరైనా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పరిశ్రమలు రావాలని, ఉద్యోగాలు రావాలని కోరుకుంటారని, కానీ చంద్రబాబు ఏపీకి ఏ పరిశ్రమ రాకూడదని పూజలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి బల్క్ డ్రగ్ పార్క్ వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని ప్రాజెక్ట్ వద్దని యనమల రామకృష్ణుడు లేఖరాయడంపై అంబటి మండిపడ్డారు.

First Published:  3 Sep 2022 7:32 AM GMT
Next Story