Telugu Global
Andhra Pradesh

జగనన్నా మా మొర విను..! లారీ యజమానుల గోడు

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏపీలో రోడ్ ట్యాక్స్ సవరించాలనుకుంటోంది. రవాణా వాహనాలకు 25నుంచి 30 శాతం వరకు రోడ్ ట్యాక్స్ పెంచేందుకు ప్రాథమిక ప్రకటన జారీ చేసింది. దీనిపై లారీ యజమానుల సంఘం ఆందోళన చేపట్టింది.

జగనన్నా మా మొర విను..! లారీ యజమానుల గోడు
X

ఏపీలో లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు సీఎం జగన్ కి ఓ సుదీర్ఘ లేఖ రాశారు. అందులో తమ కష్టాలను ఏకరువు పెట్టారు. అందరికీ అన్ని పథకాలు అమలు చేస్తున్న జగన్, లారీ ఓనర్లకు మాత్రం అన్యాయం చేస్తున్నారని చెప్పారు. తమ కష్టాలు తీర్చలేకపోతే, తమ బాధ వినకపోతే పక్క రాష్ట్రాల చిరునామాలతో లారీలను ట్రాన్స్ ఫర్ చేసుకోవాల్సి వస్తుందని కాస్త కటువుగానే చెప్పేశారు. మమ్మల్ని ఈ రాష్ట్రంలో బతకనిస్తారా, లేక చిరునామాలు మార్చేసుకోమంటారా అంటూ అల్టిమేట్టం ఇచ్చేశారు.

లారీ ఓనర్ల కష్టాలేంటి..?

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా తమపై భారం పెరుగుతోందని ఆరోపించారు లారీ యజమానుల సంఘం నేతలు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఏపీలో రోడ్ సెస్ భారీగా వసూలు చేస్తున్నారని చెప్పారు. కర్నాటక కంటే ఏపీలో డీజిల్ ధర లీటరుకి 12 రూపాయలు ఎక్కువ, తమిళనాడుతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ ధర లీటరుకి 5 రూపాయలు ఎక్కువ. ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీశారు. సకాలంలో అనుమతులు రెన్యువల్ చేసుకోకపోతే గతంలో వెయ్యి రూపాయలు అపరాధ రుసుము వసూలు చేసేవారని, దాన్ని 2020 అక్టోబర్ లో 20వేల రూపాయలకు పెంచేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

2021 డిసెంబర్ లో గ్రీన్ ట్యాక్స్ ని 200 రూపాయలనుంచి 20వేల రూపాయలకు పెంచారనేది మరో ఆరోపణ. గ్రీన్ ట్యాక్స్ తమిళనాడులో 500 కాగా, ఏపీలో 20వేలు. ఇదెక్కడి న్యాయం అంటున్నారు లారీ యజమానులు.

మూలిగే నక్కపై తాటిపండు..

అసలే కొవిడ్‌ తర్వాత రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. దానికితోడు పెట్రోల్, డీజిల్ రేట్లతో భారం పెరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏపీలో రోడ్ ట్యాక్స్ సవరించాలనుకుంటోంది. రవాణా వాహనాలకు 25నుంచి 30 శాతం వరకు రోడ్ ట్యాక్స్ పెంచేందుకు ప్రాథమిక ప్రకటన జారీ చేసింది ప్రభుత్వం. దీనిపై లారీ యజమానుల సంఘం ఆందోళన చేపట్టింది. లారీలకు మినహాయింపు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

రోడ్ ట్యాక్స్ పెంచితే కట్టలేమని, ఇప్పటికే ఈఎంఐలు భారమయ్యాయని తాము ఈ రాష్ట్రంలో ఉండలేమంటూ సీఎం జగన్ కి లేఖ రాశారు లారీ యజమానులు. ఆంధ్రాలో ఉన్న లారీలను సరిహద్దు రాష్ట్రాలకు చిరునామాకు మార్చుకుంటామని తేల్చి చెప్పారు. కనీసం పెంపు ప్రతిపాదనలో ఉన్న రోడ్డు ట్యాక్స్‌ విషయంలో లారీలకు మినహాయింపు ఇవ్వాలన్నారు.

First Published:  17 Jan 2023 11:41 PM GMT
Next Story