Telugu Global
Andhra Pradesh

కామ్రేడ్స్ దారి ఎటు?... ఏ గట్టునుంటారు?

కామ్రేడ్స్ దారి ఎటు?... ఏ గట్టునుంటారు?
X

ఏపీలోని వామపక్ష నేతలు గత కొంతకాలంగా బేషరతుగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ చేస్తున్న అనేక ఉద్యమాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు భాగస్వామ్యం అయ్యాయి. కమ్యూనిస్టు పార్టీలకు ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా ఉనికి లేకపోయినప్పటికీ వాటి చేతిలో కార్మికసంఘాలు ఉన్నాయి. అవి కూడా ఎంతో బలంగా ఉన్నాయి. దీంతో జగన్ సర్కారును ఇరుకున పెట్టేందుకు కమ్యూనిస్టులు అవసరమైనప్పుడల్లా తెలుగుదేశం పార్టీకి సాయం చేస్తూ వచ్చారు. ఉద్యోగుల సమ్మె విషయంలో .. అంగన్వాడీల సమస్యలు సహా.. తెలుగుదేశం పార్టీ గత కొన్నేళ్లుగా చేస్తున్న అమరావతి ఉద్యమానికి కూడా కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు.

కానీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వైఖరితో వారు ఎటుతేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జతకడితే కొన్ని సీట్లలో పోటీచేయొచ్చన్నది వారి భావన అయిఉండొచ్చు.కానీ ఇటీవల చంద్రబాబు నాయుడు.. అడగకపోయినా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారు.

దీంతో కమ్యూనిస్టులు డైలమాలో పడ్డారట. తాము తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీకి చంద్రబాబు మద్దతు ఇవ్వడంతో వారు ఎటు తేల్చుకోలేకపోతున్నారని టాక్.

ఇప్పుడు కమ్యూనిస్టులు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. తెలుగుదేశం పార్టీ.. బీజేపీకి దూరమైంది కాబట్టి.. కమ్యూనిస్టులు వారికి దగ్గరయ్యారు. కానీ ఇప్పుడు చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం బీజేపీకి దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. దీంతో కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి గందరగోళంలోపడిపోయింది. బీజేపీకి మద్దతు ఇస్తున్న టీడీపీకి కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తే తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వారు ఏం చేయబోతున్నారు? ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు? అన్నది తేలాల్సి ఉంది.

First Published:  24 July 2022 12:30 AM GMT
Next Story