Telugu Global
Andhra Pradesh

తలదించుకోవాల్సిన అవసరం లేదు.. అది మా గొప్పతనం

మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటం వైసీపీ ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం అని అన్నారు హోం మంత్రి తానేటి వనిత.

తలదించుకోవాల్సిన అవసరం లేదు.. అది మా గొప్పతనం
X

మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ లో ఏపీ నెంబర్-1 స్థానంలో ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి. 'స్మగ్లింగ్ ఇన్ ఇండియా 2021-22 పేరుతో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ విడుదల చేసిన నివేదికలో ఏపీ టాప్ ప్లేస్ లో ఉంది. ఏడాది కాల వ్యవధిలో ఏపీలో 18,267 కేజీల డ్రగ్స్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 90 మందిని అరెస్ట్‌ చేశారు. దేశంలో ఇంత ఎక్కువగా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నది ఇక్కడే. ఏపీ తర్వాత త్రిపుర, అసోం నెంబర్-2, నెంబర్-3 స్థానాల్లో ఉన్నాయి. దీంతో ప్రతిపక్షాలు ఈ వ్యవహారాన్ని రాద్ధాంతం చేస్తున్నాయి. జగన్ పాలనలో ఏపీ డ్రగ్స్ రాజధానిగా మారిందని, ఏపీలో అత్యథికంగా డ్రగ్స్ పట్టుబడటమే దీనికి నిదర్శనం అని అంటున్నారు ప్రతిపక్ష నేతలు.

అది మా ఘనత..

టీడీపీ విమర్శలను వైసీపీ తిప్పికొట్టింది. డ్రగ్స్ అత్యథికంగా ఏపీలో పట్టుబడ్డాయంటే, ఏపీలో పోలీసింగ్ అంత సమర్థంగా ఉందని అర్థం చేసుకోవాలని చెప్పారు హోం మంత్రి తానేటి వనిత. మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటం వైసీపీ ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం అని అన్నారామె. సీఎం జగన్ సమర్థతే దీనికి కారణమని, పోలీసు యంత్రాంగం మెరుగైన పనితీరు ఇందుకు నిదర్శనమంటూ కొనియాడారు.

మీరు ఫెయిలయ్యారు, మేం పనిచేస్తున్నాం..

గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్, మత్తు పదార్థాల రవాణాను ఆరికట్టడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు హోం మంత్రి తానేటి వనిత. రాష్ట్రంలో గంజాయి రవాణాను ఆరికట్టడానికి వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, గంజాయి సాగుని జీవనాధరంగా మార్చుకున్న గిరిజనులకు అవగాహన కల్పించి వారికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపించామని, అందుకే 2021-22 ఏడాదికి అత్యథికంగా ఏపీలో డ్రగ్స్ పట్టుబడ్డాయని చెప్పారు. అదే సమయంలో ఎర్రచందనం అక్రమ రవాణాను కూడా అరికట్టగలిగామని, సహజ సంపద దోపిడీదారుల పరం కాకుండా కాపాడామని చెప్పారు.

First Published:  6 Dec 2022 9:46 AM GMT
Next Story