Telugu Global
Andhra Pradesh

బిగ్ బాస్ కి ఏపీ హైకోర్టు చీవాట్లు..

కోర్టు కూడా దీనిపై ఘాటుగా స్పందించింది. అప్పట్లో ఎలాంటి సినిమాలు వచ్చాయి, ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు వస్తున్నాయని ప్రశ్నిస్తూ విచారణను అక్టోబర్ 11కి వాయిదా వేసింది.

బిగ్ బాస్ కి ఏపీ హైకోర్టు చీవాట్లు..
X

1970ల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా..? ఇప్పుడెలాంటి సినిమాలు, టీవీ షో లు వస్తున్నాయో చూస్తున్నాం కదా.. అంటూ సింపుల్ గా ఒక్క ముక్కలో బిగ్ బాస్ షోకి, నిర్వాహకులకు తలంటింది ఏపీ హైకోర్టు. తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోని బ్యాన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఘాటుగా స్పందించింది. ప్రతివాదులకు నోటీసులిచ్చే విషయంలో తదుపరి వాయిదాలో నిర్ణయం తీసుకుంటామన్న ధర్మాసనం.. కేసు విచారణను అక్టోబర్‌11కు వాయిదా వేసింది.

ఇటీవల బిగ్ బాస్ షో పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. రేటింగ్స్ కోసం షో లో ఉన్నవారు ఒకరితో ఒకరు కావాలని గొడవ పడటం, అతి ప్రేమను చూపించుకోవడం, టాస్క్ ల పేరుతో అందరి ముందే అసభ్యంగా ప్రవర్తించడం.. చూస్తూనే ఉన్నాం. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లొస్తే పెద్ద సెలబ్రిటీ అయిపోవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది ఈ హౌస్ లో ఎంట్రీకోసం ట్రై చేస్తుంటారు. ఆయా రంగాల్లో ప్రముఖులను సెలక్ట్ చేసుకుంటున్నామని చెప్పే నిర్వాహకులు, రెమ్యునరేషన్ ఇచ్చి మరీ కొంతమంది గొడవలు సృష్టించేవారిని లోపలికి పంపుతారు. అక్కడినుంచి అసలు గేమ్ మొదలవుతుంది. బిగ్ బాస్ వచ్చినంతసేపు టీవీలకు అతుక్కుపోతున్న కుర్రకారు యూట్యూబ్ లో కూడా లైవ్ లింక్ లు చూస్తుంటారు. మిగతా అన్ని కార్యక్రమాలలాగే ఇది కూడా ఉపయోగం లేని కార్యక్రమమే అయినా.. ఇందులో అశ్లీలత, అసభ్యత, జుగుప్స కలిగించే మాటలు, తిట్లు.. చాలానే ఉంటాయి. సీపీఐ నారాయణ వంటి వ్యక్తులు ఇటీవల కాలంలో ఈ బిగ్ బాస్ వ్యవహారాలపై సీరియస్ గా స్పందించారు. ఇలాంటి కార్యక్రమానికి సీనియర్ హీరో నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించడం కూడా చాలామందికి నచ్చడంలేదు.

బయట స్పందనలు ఎలా ఉన్నా.. తాజాగా ఈ షో నిర్వహణపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిటిషనర్ తరపున శివప్రసాద్‌ రెడ్డి వాదనలు వినిపించారు. టీవీ షోలు ఇండియన్ 'బ్రాడ్‌ కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబీఎఫ్‌) గైడ్‌లైన్స్‌ పాటించడం లేదని ఆయన ధర్మాసనానికి తెలిపారు. కేంద్రం తరపు న్యాయవాది దీనిపై స్పందించడానికి సమయం కోరారు. అటు కోర్టు కూడా దీనిపై ఘాటుగా స్పందించింది. అప్పట్లో ఎలాంటి సినిమాలు వచ్చాయి, ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు వస్తున్నాయని ప్రశ్నిస్తూ విచారణను అక్టోబర్ 11కి వాయిదా వేసింది.

First Published:  30 Sep 2022 9:07 AM GMT
Next Story