Telugu Global
Andhra Pradesh

హైకోర్టు జడ్జిల పేరుతో డబ్బు వసూలు- హైకోర్టు సీరియస్‌

ఉద్యోగాల నియామకానికి సంబంధించి కేవలం హైకోర్టు వెబ్‌సైట్‌ను మాత్రమే ఫాలో కావాలని, రిజిస్ట్రార్ ఆలపాటి గిరిధర్ హైకోర్టు తరపున విడుదల చేసిన ప్రకటనలో సూచించారు.

హైకోర్టు జడ్జిల పేరుతో డబ్బు వసూలు- హైకోర్టు సీరియస్‌
X

హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ న్యాయమూర్తుల పేర్లతో కొందరు డబ్బులు వసూలు చేయడంపై ఏపీ హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. ఒక ప్రకటనను విడుదల చేసింది. హైకోర్టుతో పాటు వివిధ కింది స్థాయి కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కావడంతో కొందరు వ్యక్తులు ఏకంగా హైకోర్టు రిజిస్ట్రార్‌ సంతకాలతో ఉద్యోగ నియామక పత్రాలను సృష్టించారు. కొన్నిచోట్ల హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను కూడా వాడుకుంటూ ఉద్యోగం గ్యారెంటీ అంటూ భారీగా డబ్బులు వసూలు చేశారు.

రిజిస్ట్రార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి కొందరు అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఇప్పటికే 15 మందిని ఈ వ్యవహారంలో అరెస్ట్ చేశారు. కేటుగాళ్లకు డబ్బులు ఇచ్చి వారి నుంచి నకిలీ నియామకపత్రం పొందిన వ్యక్తిపైనా గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ అంశాలు తన దృష్టికి రావడంతో హైకోర్టు స్పందిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. మోసగాళ్ల తప్పుడు ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని హైకోర్టు సూచించింది. న్యాయమూర్తుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలుంటాయని హైకోర్టు హెచ్చరించింది. ఉద్యోగాల విషయంలో తప్పుడు ప్రచారం చేసే వారిపైనా చర్యలుంటాయని కోర్టు స్పష్టం చేసింది. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని వస్తే అలాంటి వారి గురించి హైకోర్టు దృష్టికి తీసుకురావాలని ప్రకటనలో సూచించారు. ఉద్యోగాల నియామకానికి సంబంధించి కేవలం హైకోర్టు వెబ్‌సైట్‌ను మాత్రమే ఫాలో కావాలని, రిజిస్ట్రార్ ఆలపాటి గిరిధర్ హైకోర్టు తరపున విడుదల చేసిన ప్రకటనలో సూచించారు.

First Published:  16 Nov 2022 3:16 AM GMT
Next Story