Telugu Global
Andhra Pradesh

వేల సంఖ్యలో ధిక్కరణ పిటిషన్లా? ఏపీ హైకోర్టు ఆందోళన

ఈ పిటిషన్ విచారణ సందర్భంగానే కోర్టు ధిక్కరణ పిటిషన్లపై ఆందోళన వ్యక్తం చేసింది. స్పందించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం.. న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలు అమలు చేసి, ధిక్కరణ పిటిషన్ల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చారు.

వేల సంఖ్యలో ధిక్కరణ పిటిషన్లా? ఏపీ హైకోర్టు ఆందోళన
X

భారీగా వచ్చినపడుతున్న కోర్టు ధిక్కరణ పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ ఏడాదిలో నాలుగు వేలకు పైగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు వచ్చాయని జస్టిస్ శేషసాయి, జస్టిస్ రఘునందరావులతో కూడిన ధర్మాసనం గుర్తుచేసింది. ఈ స్థాయిలో ధిక్కరణ పిటిషన్లు దాఖలవ్వ‌డం ఆందోళన కలిగించే అంశమని కోర్టు వ్యాఖ్యానించింది.

ధిక్కరణ పిటిషన్లు పెరిగిపోవడంతో ఉన్నతాధికారులను కోర్టుకు పిలవాల్సిన పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయని కోర్టు చెప్పింది. పింఛ‌న్ ప్రయోజనాలను కల్పించే విషయంలో సర్వీసు క్రమబద్దీకరణకు ముందు నాటి సర్వీసును కూడా పరిగణలోకి తీసుకోవాలని కొందరు పార్ట్‌ టైం టీచర్లు గతంలో కోర్టుకు వెళ్లారు. వారికి అనుకూలంగా హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా తీర్పు వచ్చింది. అయితే కోర్టులు చెప్పినట్టు వారికి పింఛ‌న్ ప్రయోజనాల కల్పించకపోవడంతో పలువురు ఉన్నతాధికారులపై ధిక్కరణ వ్యాజ్యం దాఖలైంది.

ఈ పిటిషన్ విచారణ సందర్భంగానే కోర్టు ధిక్కరణ పిటిషన్లపై ఆందోళన వ్యక్తం చేసింది. స్పందించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం.. న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలు అమలు చేసి, ధిక్కరణ పిటిషన్ల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చారు.

అటు ఉపాధి బిల్లుల చెల్లింపు జాప్యంపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లుల చెల్లింపున‌కు ఏడాది క్రితం ఇచ్చిన ఆదేశాలు కూడా అమలు కాకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసులో సీనియర్ ఐఏఎస్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, కోన శశిధర్, ఎస్‌ఎస్ రావత్‌లు హైకోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. బిల్లులు చెల్లించామని వివరించారు. స్పందించిన హైకోర్టు.. కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలై, అది విచారణకు రావడానికి రెండు రోజుల ముందు బిల్లులు చెల్లించడం ఏమిటని ప్రశ్నించింది. బిల్లుల చెల్లింపు ఏడాది పాటు ఆలస్యం అయితే ఎలా..? అని ప్రశ్నించింది. మీ జీతం ఒక నెల ఆలస్యంగా ఇస్తామంటే ఒప్పుకుంటారా..? అని ఐఏఎస్‌లను కోర్టు ప్రశ్నించింది. ఈ ఆలస్యానికి వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

First Published:  19 Nov 2022 2:25 AM GMT
Next Story