Telugu Global
Andhra Pradesh

కేసులు, ఆస్తుల వివరాలు పత్రికల్లో ప్రచురించాల్సిందే.. - తేల్చిచెప్పిన హైకోర్టు

సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై, ఆ తీర్పు అమలవుతుందో లేదో చూడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.

కేసులు, ఆస్తుల వివరాలు పత్రికల్లో ప్రచురించాల్సిందే.. - తేల్చిచెప్పిన హైకోర్టు
X

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమపై ఉన్న కేసులు, ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా పత్రికల్లో ప్రచురించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. అంతేకాదు.. ఆయా పార్టీల వెబ్‌సైట్‌లలో కూడా ఆ వివరాలను పొందుపరచాల్సిందేనని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, జస్టిస్‌ రావు రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల కేసుల వివరాలు, ఆస్తుల వివరాలకు సంబంధించిన ఫారం 26ను తెలుగులో అందుబాటులో ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ తెలుగు భాషోద్యమ సమాఖ్య గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ సామల రమేష్‌బాబు హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌ బాబు వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి నామినేషన్‌ వేశాక తనపై ఉన్న కేసుల వివరాలు, ఆస్తుల వివరాలను కనీస మూడుసార్లు పత్రికల్లో ప్రచురించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయాల్సిందేనని స్పష్టంచేసింది.

అంతేకాదు.. సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై, ఆ తీర్పు అమలవుతుందో లేదో చూడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు కేసుల వివరాలను, ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా పత్రికల్లో ప్రచురించారో లేదో తెలుసుకుని చెబుతామని హైకోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు తదుపరి విచారణను జూన్‌ 26కి వాయిదా వేసింది.

First Published:  2 May 2024 3:42 AM GMT
Next Story