Telugu Global
Andhra Pradesh

మేం మౌనంగా ఉంటే.. రాబోయే సీజేలకు ఇబ్బందే..

విచారణ సందర్భంగా వెకేషన్ కోర్టు అత్యవసరంగా విచారించడాన్ని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తప్పుబ‌ట్టగా.. సీపీఐ రామకృష్ణ తరపు న్యాయవాది అశ్విని కుమార్ మాత్రం విచారించే విచక్షణాధికారం వెకేషన్ కోర్టుకు ఉంటుందని వాదించారు.

మేం మౌనంగా ఉంటే.. రాబోయే సీజేలకు ఇబ్బందే..
X

రహదారులపై రాజకీయ పార్టీల సభలు, సమావేశాలను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో - 1ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు. వెకేషన్ కోర్టులో తాము నిర్దేశించిన రోస్టర్ కు భిన్నంగా జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని బెంచ్ వ్యవహరించిందని ప్రధాని న్యాయమూర్తి తప్పుబ‌ట్టారు.

వెకేషన్ కోర్టులో ఏం జరిగిందో తమకు స్పష్టంగా తెలుసన్నారు. అయితే న్యాయవ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా ఆ వివరాలన్నింటినీ ఇప్పుడు బహిర్గతం చేయలేకపోతున్నామని సీజే వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న తాను మౌనంగా చూస్తూ ఉండిపోతే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిణామాలు రాబోయే ప్రధాన న్యాయమూర్తులకు కూడా ఇబ్బందికరంగా తయారవుతాయన్నారు. పరిపాలనపరంగా ప్రధాన న్యాయమూర్తి నిర్దేశించిన రోస్టర్ లో రెండు పేరాలను మార్చాలని వ్యాఖ్యానించారు. తద్వారా ఒరిజినల్ రోస్టర్ ను మార్చేశారని.. అసలు జీవో.1పై రాజకీయ పార్టీలు ఎందుకు ఈ స్థాయిలో గగ్గోలు పెడుతున్నాయని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.

జీవోను సవాల్ చేస్తూ సీపీఐ రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ తో పాటు ఇదే అంశంపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రుద్రరాజు దాఖలు చేసిన పిటిషన్లను కూడా హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా వెకేషన్ కోర్టు అత్యవసరంగా విచారించడాన్ని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తప్పుబ‌ట్టగా.. సీపీఐ రామకృష్ణ తరపు న్యాయవాది అశ్విని కుమార్ మాత్రం విచారించే విచక్షణాధికారం వెకేషన్ కోర్టుకు ఉంటుందని వాదించారు.

పౌరుల హక్కుల్ని ప్రభుత్వం కాలరాస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అని న్యాయస్థానంలో ఆయన వాదించారు. ఇలాంటి జీవో ఒక్కరోజు కూడా మనుగడలో ఉండటానికి వీల్లేదన్నారు. రాజకీయ పార్టీలు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతూ ఉంటాయని వాటిని అడ్డుకునే ప్రక్రియ ప్రజాస్వామ్యంలో ఏ మాత్రం మంచిది కాదని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తరఫున న్యాయవాది శ్రీధర్ వాదించారు. అధికార పార్టీ విషయంలో ఒకలా, ప్రతిపక్షాల విషయంలో మరోలా ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

అయితే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ మాత్రం ప్రతిపక్షాల ఆందోళనలో అర్థం లేదని కొట్టిపారేశారు. అసలు జీవో.1లో ఎక్కడా కూడా నిషేధం అన్న పదమే లేదన్నారు. పరిస్థితుల్ని బట్టి పోలీసులు అనుమతులు ఇస్తున్నారని కూడా వివరించారు. నారా లోకేష్ పాదయాత్రకు కూడా అనుమతులు ఇచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అన్ని పక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

First Published:  25 Jan 2023 5:56 AM GMT
Next Story