Telugu Global
Andhra Pradesh

ఉద్యోగుల సమస్యలని ఏపీ ప్రభుత్వం లైట్ తీసుకుంటోందా..?

ఉద్యోగుల్లో వ్యతిరేక ఉందనేమాట వాస్తవమే. అయితే అది ఏ స్థాయిలో ఉందనేది ప్రభుత్వం అంచనా వేస్తుందా లేదా అనేది తేలడంలేదు. ఒకవేళ అంచనా వేసినా కూడా అనుకూల ఉద్యోగ సంఘాల మాటలతో వైసీపీ సంతృప్తి పడుతోంది.

ఉద్యోగుల సమస్యలని ఏపీ ప్రభుత్వం లైట్ తీసుకుంటోందా..?
X

ఓవైపు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు గవర్నర్ ని కలసి ఫిర్యాదు చేశారు. మరోవైపు సీపీఎస్ రద్దుకోసం ఉపాధ్యాయులు ధర్నాలు చేస్తున్నారు. ఇంకోవైపు ఈనెల 26న డెడ్ లైన్ గా ప్రకటించి ఏపీ జేఏసీ కార్యాచరణకు సిద్ధమవుతోంది. కానీ వైసీపీ అనుకూల మీడియా వీటిల్ని అసలు పట్టించుకోవట్లేదు. కేవలం నంద్యాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీ¬స్‌ ఫెడరేషన్‌(APGEF) ర్యాలీ, సభను మాత్రమే హైలెట్ చేసింది. ప్రభుత్వానికి ఉద్యోగులు మద్దతుగా ఉన్నారని, ప్రతిపక్షాలు మాత్రం రాద్ధాంతం చేస్తున్నాయని తెలిపింది.

Advertisement

ఆత్మస్తుతి ఎంతవరకు..?

ఆత్మస్తుతి బాగానే ఉంది కానీ, ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని, వ్యతిరేకతను ప్రభుత్వం పట్టించుకుంటోందా లేదా అనేదే అసలు సమస్య. సీపీఎస్ రద్దుకోసం ఉద్యోగ సంఘాలు ఉద్యమం మొదలు పెట్టాయి. మూడున్నరేళ్లుగా సీపీఎస్ విషయంలో మీనమేషాలు లెక్కపెడుతున్నారే కానీ సమస్యను పరిష్కరించలేకపోయింది ఏపీ ప్రభుత్వం. పోనీ సీపీఎస్ రద్దు తమ వల్ల కాదు అని తేల్చేసిందా అంటే అదీ లేదు.


కేవలం మంత్రులు, సలహాదారులు మాత్రమే ఉద్యోగులతో సమావేశమవుతారు, చర్చిస్తారు, మీడియాతో మాట్లాడతారు, వెళ్లిపోతారు. ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పడమే వారి విధి. ఇంతకీ జగన్ మనసులో ఏముంది, ఆయన సీపీఎస్ గురించి ఏమని ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలని ఉద్యోగులకు ఉండదా.

Advertisement


పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైంది, వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ విషయంలో ఇప్పటి వరకూ నోరు మెదపకపోవడమేంటి అని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిలదీస్తున్నాయి. పోనీ ఎన్నికల టైమ్ లో దీనికి పరిష్కారం చూపెడతారా..? అప్పటికప్పుడు హామీ ఇచ్చినా, దాన్ని నమ్మేదెలా అంటున్నారు ఉద్యోగులు.

ప్రభుత్వం ఆలోచన ఏంటి..?

ఉద్యోగుల్లో వ్యతిరేక ఉందనేమాట వాస్తవమే. అయితే అది ఏ స్థాయిలో ఉందనేది ప్రభుత్వం అంచనా వేస్తుందా లేదా అనేది తేలడంలేదు. ఒకవేళ అంచనా వేసినా కూడా అనుకూల ఉద్యోగ సంఘాలతో వైసీపీ సంతృప్తి పడుతోంది. అసలు ఉద్యోగుల్లో అసంతృప్తే లేదన్నట్టుగా కొన్ని సంఘాలు వైసీపీ అధినాయకత్వాన్ని తప్పుదోవ పట్టించే అవకాశం కూడా ఉంది.


అంతా బాగానే ఉంది అని సరిపెట్టుకుంటే కుదరదు, ఎక్కడికక్కడ అసంతృప్తిని లెక్కగట్టి సమస్యలు పరిష్కరించుకుంటేనే మంచిది అనే వాదన వినపడుతోంది. మొత్తమ్మీద ఉద్యోగుల్లో ఎక్కువశాతం మంది ప్రభుత్వ విధానాలతో సంతృప్తిగా లేరు అనే విషయం మాత్రం వాస్తవం. ఈ వాస్తవం జగన్ వరకు వెళ్తుందా, లేక అనుకూల సంఘాల నేతలతో ఆయన ఆల్ ఈజ్ వెల్ అనే ఆలోచనలోనే ఉండిపోతారా అనేది ఎన్నికలనాటికి తేలిపోతుంది.

Next Story