Telugu Global
Andhra Pradesh

సురక్ష ఖర్చు పాతిక కోట్లు.. ప్రతిఫలం ఏంటంటే..?

ప్రజలు కోరినవన్నీ ఇచ్చేస్తారనుకుంటే పొరపాటే. ఆయా పథకాల లబ్ధిదారులకు భవిష్యత్తులో అవసరం అనుకున్న సర్టిఫికెట్లు మాత్రమే పొదుపుగా మంజూరు చేస్తున్నారు. అది కూడా ఒక్కో సర్టిఫికెట్ కి 50రూపాయలు మాత్రమే రుసుములో తగ్గిస్తారు.

సురక్ష ఖర్చు పాతిక కోట్లు.. ప్రతిఫలం ఏంటంటే..?
X

ఏపీలో జగనన్న సురక్ష పేరుతో నెలరోజులపాటు కార్యక్రమాలు చేపట్టింది ప్రభుత్వం. గతంలో రుసుము తీసుకుని ఇచ్చే సర్టిఫికెట్లు ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు. అది కూడా గడువుకంటే ముందే. ఇదీ ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఎంతమందికి ఎన్ని సర్టిఫికెట్లు ఇస్తున్నారనేది కూడా ప్రభుత్వం లెక్క చెబుతోంది. ఈ లెక్కకి అసలు ఈ కార్యక్రమం కోసం ఖర్చు పెడుతున్న డబ్బుకి పొంతన ఉందా అంటే సమాధానం లేదు. ఏపీలో సురక్ష కార్యక్రమం కోసం ఏకంగా 25కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం.

వృథా ఖర్చేనా..?

సురక్ష కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఊరూవాడా సచివాలయాల పరిధిలో సభలు పెట్టి సర్టిఫికెట్లు ఇస్తూ నాయకులు, అధికారులు ఫొటోలు దిగి ప్రచారం చేసుకుంటారు. ఇలా ఒక్కో సభ కోసం గ్రామాల్లో 15వేల రూపాయలు, పట్టణాల్లో 25వేల రూపాయలు కేటాయిస్తున్నారు. ఈ ఖర్చు మొత్తం 25కోట్ల రూపాయలుగా లెక్క తేల్చారు. ఇక అధికారులు, సిబ్బంది సురక్ష పేరుతో మిగతా పనులన్నీ పక్కనపెట్టేస్తున్నారు. వారి పనిదినాలు అదనపు ఖర్చు అనుకోవాల్సిందే.

ఎవరికి లాభం..? ఏంటి లాభం..?

కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ సహా ఇతర సర్టిఫికెట్లు ఈ సురక్ష కార్యక్రమంలో ఉచితంగా ఇస్తారు. అయితే ప్రజలు కోరినవన్నీ ఇచ్చేస్తారనుకుంటే పొరపాటే. ఆయా పథకాల లబ్ధిదారులకు భవిష్యత్తులో అవసరం అనుకున్న సర్టిఫికెట్లు మాత్రమే పొదుపుగా మంజూరు చేస్తున్నారు. అది కూడా ఒక్కో సర్టిఫికెట్ కి 50రూపాయలు మాత్రమే రుసుములో తగ్గిస్తారు. ఈ విషయంలో వాలంటీర్లకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. సర్టిఫికెట్లకోసం ప్రజలనుంచి వచ్చే వినతుల్ని వీరు పక్కనపెడుతున్నారు. సచివాలయ సిబ్బంది ఏ కుటుంబానికి ఏ సర్టిఫికెట్ అవసరమో డిసైడ్ చేస్తే వాలంటీర్లు వాటికోసం అభ్యర్థనలు తీసుకుంటున్నారు. ఇలా జరుగుతోందీ వ్యవహారం. అయితే కొన్ని సచివాలయాల్లో మాత్రం మ్యుటేషన్లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, రేషన్ కార్డ్ అడిషన్స్, డిలీషన్స్.. అన్నీ జరుగుతున్నాయి. అలాంటి సచివాలయాలను వేళ్లమీద లెక్కబెట్టొచ్చు.

మొత్తమ్మీద జగనన్న సురక్ష అనేది ప్రచార ఆర్భాటంలాగే మిగిలిపోతోందని చెప్పాలి. రుసుము లేకుండా సర్టిఫికెట్లు అనే విధానాన్ని నేరుగా సచివాలయాల్లో కూడా అమలు చేయొచ్చు. ప్రతి సర్టిఫికెట్ మంజూరుకి నిర్ణీత కాలవ్యవధి ఉంది కాబట్టి దరఖాస్తు దారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సురక్ష అనే పేరుతో వారందర్నీ ఒకేచోట చేర్చి షామియానాలు, కుర్చీలు వేసి, నాయకులు సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అంతే తేడా. ఎన్నికల వేళ ఇలాంటి జిమ్మిక్కులన్నీ అనుకున్నట్టుగా పనిచేస్తాయో లేదో వేచి చూడాలి.

First Published:  15 July 2023 1:33 AM GMT
Next Story