Telugu Global
Andhra Pradesh

ఎన్నికల ఏడాదిలో ఏపీలో డీఎస్సీ.. ఎన్ని పోస్ట్ లు భర్తీ చేస్తారంటే..?

ఉన్న ఉద్యోగులకే జీతాలివ్వడం బాగా ఆలస్యమవుతోంది. ఈ దశలో డీఎస్సీ నిర్వహణ, కొత్త ఉద్యోగాలు, కొత్త ఉద్యోగులకు జీతాలు అంటే.. సాధ్యమేనా అంటూ కౌంటర్లిస్తున్నారు కొంతమంది.

ఎన్నికల ఏడాదిలో ఏపీలో డీఎస్సీ.. ఎన్ని పోస్ట్ లు భర్తీ చేస్తారంటే..?
X

లక్షల్లో ఉద్యోగాలు భర్తీ చేశామని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా.. అందులో గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ నోటిఫికేషన్లు, పోలీస్ రిక్రూట్ మెంట్లు ఉంటేనే ఆ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ఆదరిస్తారు, మరోసారి ఓటు వేయాలనుకుంటారు. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం రావడంతోనే సచివాలయ ఉద్యోగాలంటూ 2.5 లక్షలమందికి ఉపాధి చూపించింది. ఆ తర్వాత నోటిఫికేషన్ల మాటెత్తకుండా కాలం గడిపింది. ఇటీవల పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్షలు జరిగినా పోస్ట్ ల సంఖ్య నామమాత్రమే. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా డీఎస్సీ ఊసేలేదు. ఈ దశలో సడన్ గా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ నోటిఫికేషన్ గురించి మాట్లాడారు. ఉపాధ్యాయ పోస్ట్ ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెబుతున్నానన్నారు.

ఏపీలో ఎన్నికలకు టైమ్ దగ్గరపడింది. ఈ దశలో డీఎస్సీ నోటిఫికేషన్ అంటే కచ్చితంగా ఎన్నికల స్టంట్ అంటూ ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేయడం గ్యారెంటీ. కానీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ వేయాల్సిందేనని డిసైడ్ అయింది. మరి నిజంగానే ఏపీలో ఉపాధ్యాయ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయా..? ఎన్ని పోస్ట్ లకు నోటిఫికేషన్ వేస్తారనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

పాఠశాలల రేషనలైజేషన్ తో ఏపీలో స్కూల్స్ సంఖ్య తగ్గి ఉపాధ్యాయుల సగటు సంఖ్య పెరిగింది. ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా దగ్గర్లో ఉన్న పెద్ద స్కూల్స్ లో విలీనం అయ్యాయి. భవిష్యత్తులో ఉపాధ్యాయుల రిక్రూట్ మెంట్ కి అవకాశం లేకుండా ఈ పని చేశారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దశలో అసలు ఖాళీలెన్ని..? వాటిలో తప్పనిసరిగా భర్తీ చేయాల్సినవి ఎన్ని..? అనేది తేలాల్సి ఉంది. ఉపాధ్యాయ బదిలీలు పూర్తయితే, ఆ తర్వాత ఖాళీల లెక్క చూసి నోటిఫికేషన్ వేయాల్సి ఉంటుంది.

జీతాల సంగతేంటి..?

ఉన్న ఉద్యోగులకే జీతాలివ్వడం బాగా ఆలస్యమవుతోంది. ఈ దశలో ఇటీవలే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కూడా ఖరారైంది. వారికి జీతాలు దాదాపుగా రెట్టింపయ్యాయి. అంటే ఆర్థిక శాఖపై మరింత భారం పెరిగింది. ఈ దశలో డీఎస్సీ నిర్వహణ, కొత్త ఉద్యోగాలు, కొత్త ఉద్యోగులకు జీతాలు అంటే.. సాధ్యమేనా అంటూ కౌంటర్లిస్తున్నారు కొంతమంది. ఈ ప్రచారం సంగతి ఎలా ఉన్నా..? డీఎస్సీకోసం ఏళ్లతరబడి చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. వారికి మాత్రం బొత్స మాటలు ఊరటనిచ్చాయనే చెప్పాలి.

First Published:  21 April 2023 9:48 AM GMT
Next Story