Telugu Global
Andhra Pradesh

మెగా డీఎస్సీకి జగన్ వెనకడుగు.. కారణం ఏంటి..?

గ్రామ, వార్డు సచివాలయ పోస్ట్ లు, వాలంటీర్ పోస్ట్ లనే ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. డీఎస్సీ, గ్రూప్స్ విషయంలో ఎందుకో ఆ సాహసం చేయలేకపోతోంది. ఖాళీలు ఎక్కువగా ఉన్నా కూడా ప్రభుత్వం సర్దుబాటు ధోరణిలో ఉంది.

మెగా డీఎస్సీకి జగన్ వెనకడుగు.. కారణం ఏంటి..?
X

ఇటీవల ఏపీలో గ్రూప్-1, గ్రూప్-2 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ఖాళీల సంఖ్యపై నిరుద్యోగులు సంతోషంగా లేరు. ఎన్నికల లోపు మెగా డీఎస్సీ వేస్తారనే ఆశలు వారిలో ఉన్నాయి. కానీ తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఆ ఆశలపై కూడా నీళ్లు చల్లారు మంత్రి బొత్స సత్యనారాయణ. శాసన మండలిలో విద్యా శాఖ మంత్రి బొత్స టీచర్ పోస్టులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖాళీగా ఉన్న 8 వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఖాళీల భర్తీకి తాము కట్టుబడి ఉన్నామనీ, రాష్ట్రంలో మెరుగైన విద్యను అందిస్తున్నామని ఆయన చెప్పారు.

ఖాళీలు ఎన్ని..? భర్తీ చేసేవి ఎన్ని..?

మంత్రి బొత్స టీచర్ పోస్టుల ప్రకటనపై ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఘాటుగా స్పందించారు. కేంద్ర మానవ వనరుల శాఖ చేసిన ప్రకటనలో.. ఏపీలో లో 40 వేలకు పైగా టీచర్ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయని తేలిందని, కానీ రాష్ట్ర మంత్రి బొత్స మాత్రం 8 వేల టీచర్ ఉద్యోగాలే భర్తీ చేస్తామని అంటున్నారని విమర్శించారు. త్వరగా ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. 40వేల ఖాళీలు ఉంటే, కేవలం 8వేలు మాత్రమే భర్తీ చేస్తామనడం సరికాదన్నారు.

జగన్ ఎందుకు వెనకాడుతున్నారు..?

సహజంగా ఎన్నికల వేళ తాయిలాలు ప్రకటించేందుకు అధికార పార్టీ సిద్ధంగా ఉంటుంది. డీఎస్సీ, గ్రూప్స్, పోలీస్ రిక్రూట్ మెంట్.. ఇలా ఏదయినా భారీ స్థాయిలో ప్రకటించి నిరుద్యోగుల మనసు గెలుచుకోవాలనుకుంటుంది. కానీ ఏపీలో పరిస్థితి వేరు. వైసీపీ అధికారంలోకి వచ్చాక భర్తీ చేసిన గ్రామ, వార్డు సచివాలయ పోస్ట్ లు, వాలంటీర్ పోస్ట్ లనే ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. డీఎస్సీ, గ్రూప్స్ విషయంలో ఎందుకో ఆ సాహసం చేయలేకపోతోంది. ఖాళీలు ఎక్కువగా ఉన్నా కూడా ప్రభుత్వం సర్దుబాటు ధోరణిలో ఉంది. నవరత్నాలపై ఎక్కువగా ఆశ పెట్టుకున్న సీఎం జగన్, మిగతా విషయాలను పూర్తిగా లైట్ తీసుకున్నారు. మీ బిడ్డ హయాంలో మీ కుటుంబానికి న్యాయం జరిగిందని మీరు అనుకుంటే, మీ కుటుంబానికి ఆర్థిక లబ్ధి నిజంగానే చేకూరితే ఓటు వేయండి అని ధీమాగా అడుగుతున్నారు. నగదు బదిలీ ఒక్కటే తనకు ఓట్లు తెచ్చిపెడుతుందని నమ్మకం పెట్టుకున్నారు. అందుకే మెగా డీఎస్సీల వంటి తాయిలాల జోలికి వెళ్లడంలేదు. జగన్ ప్రయోగం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

First Published:  23 Sep 2023 3:05 AM GMT
Next Story