Telugu Global
Andhra Pradesh

ఏపీలో విలేకర్లకు నోటీసులు

గతంలో రాజంపేటలోనూ విలేకర్లకు నోటీసులు జారీ అయ్యాయి. వారి ఆందోళనతో తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు అమలాపురంలో నోటీసులు జారీ అయ్యాయి.

ఏపీలో విలేకర్లకు నోటీసులు
X

ఏపీలో మండలస్థాయి విలేకర్లకు అధికారులు వృత్తిపన్ను నోటీసులు జారీ చేస్తున్నారు. ఐదేళ్లకు గాను 12,500 రూపాయలు చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. కోనసీమ జిల్లాలో ఈ తరహా నోటీసులు జారీ అయ్యాయి. అమలాపురం వేదికగా వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లలో పనిచేస్తున్న 28 మంది విలేకర్లకు పన్ను నోటీసులను అసిస్టెంట్ కమిషనర్‌ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ సర్కిల్ కార్యాలయం జారీ చేసింది.

2018 నుంచి ఏడాదికి 2500 రూపాయల చొప్పున పన్ను చెల్లించాలని ఆదేశించారు. 15 రోజుల్లోగా పన్నుచెల్లించాలని లేదంటే చట్ట ప్రకారం ముందుకెళ్తామని హెచ్చరించారు. దీనిపై విలేకర్లు అధికారి సుబ్బారావును సంప్రదించగా.. ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలంగా ప్రభుత్వ అక్రెడిటేషన్ కార్డులు కలిగి ఉన్న విలేకర్లు తప్పనిసరిగా వృత్తి పన్నుచెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఇది ప్రభుత్వ నిర్ణయమని.. పన్ను చెల్లించాల్సిందేనన్నారు.

గతంలో రాజంపేటలోనూ విలేకర్లకు నోటీసులు జారీ అయ్యాయి. వారి ఆందోళనతో తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు అమలాపురంలో నోటీసులు జారీ అయ్యాయి. మండల స్థాయిలో పనిచేసే విలేకర్లకు క‌చ్చితమైన జీతం కూడా ఉండదని.. అలాంటప్పుడు ఇలా తమ నుంచి పన్ను వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని విలేకర్లు ప్రశ్నిస్తున్నారు.

First Published:  21 Jan 2023 3:17 AM GMT
Next Story