Telugu Global
Andhra Pradesh

వైజాగ్‌లో ఇన్వెస్టర్ల సమ్మిట్‌కు ఎలన్ మస్క్, టిమ్ కుక్, బెజోస్‌లను ఆహ్వానిస్తున్న ఏపీ ప్రభుత్వం

విశాఖలో జరగనున్న ఈ సమ్మిట్‌కు ఆహ్వానితుల జాబితాలో అమెజాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జెఫ్ బెజోస్, సామ్‌సంగ్ చైర్మన్, సీఈఓ ఓహ్-హ్యున్ క్వాన్ కూడా ఉన్నారు. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా, కుమార్ మంగళం బిర్లా, ఆది గోద్రెజ్, రిషద్ ప్రేమ్జీ, ఎన్ చంద్రశేఖరన్ వంటి భారతీయ పారిశ్రామిక‌ దిగ్గజాలను కూడా ఆహ్వానిస్తున్నారు.

వైజాగ్‌లో ఇన్వెస్టర్ల సమ్మిట్‌కు ఎలన్ మస్క్, టిమ్ కుక్, బెజోస్‌లను ఆహ్వానిస్తున్న ఏపీ ప్రభుత్వం
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జిఐఎస్)కు ప్రధాని నరేంద్ర మోడీ, యాపిల్ సిఇఒ టిమ్ కుక్, టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్, గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సిఇఒ సత్య నాదెళ్లను ఆహ్వానించింది. ఈ సమ్మిట్ మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది.

రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి 15 మంది కేంద్రమంత్రులు, 15 మంది ముఖ్యమంత్రులు, 44 మంది ప్రపంచ పారిశ్రామికవేత్తలు, 53 మంది భారతీయ పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారులను ఆహ్వానిస్తున్నారు. .

విశాఖలో జరగనున్న ఈ సమ్మిట్‌కు ఆహ్వానితుల జాబితాలో అమెజాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జెఫ్ బెజోస్, సామ్‌సంగ్ చైర్మన్, సీఈఓ ఓహ్-హ్యున్ క్వాన్ కూడా ఉన్నారు.

ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా, కుమార్ మంగళం బిర్లా, ఆది గోద్రెజ్, రిషద్ ప్రేమ్జీ, ఎన్ చంద్రశేఖరన్ వంటి భారతీయ పారిశ్రామిక‌ దిగ్గజాలను కూడా ఆహ్వానిస్తున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక ట్వీట్‌లో, “2022లో, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,26,750 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించింది, అందులో రూ. 81,000 కోట్లు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించినవి. మార్చి 3, 4 తేదీల్లో వైజాగ్‌లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం మా శక్తినంతా కేంద్రీకరిస్తున్నాం. 2023లో ఇది అత్యంత పెద్ద సమ్మిట్ అవుతుంది'' అన్నారు.

ఏపీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతోందని, వివిధ రంగాల్లోకి రూ. 5-8 లక్షల కోట్ల మధ్య పెట్టుబడులు సమీకరించవచ్చని అంచనా వేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

"అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, వివిధ దేశాల దౌత్యవేత్తలు, దేశ వ్యాపార ప్రతినిధులు, పరిశ్రమ సంఘాలు, వాణిజ్య సంస్థలకు ఇక్కడ ఉన్న అవకాశాలను తెలుసుకోవ‌డానికి, పెట్టుబడులు పెట్టడానికి ఈ వేదిక మంచి అవకాశం కల్పిస్తుందని అధికారులు చెప్తున్నారు.

అగ్రి-ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్ , డిఫెన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, పెట్రోకెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, పునరుత్పాదక ఇంధనం, MSMEలు, టూరిజం వంటి వాటిపై మా దృష్టి కేంద్రీకరిస్తున్నాం" అని అధికారులు తెలిపారు.

పారిశ్రామిక అభివృద్ధి విధానంతో పాటు పంప్‌డ్‌ స్టోరేజీ పవర్‌, బల్క్‌ డ్రగ్‌ పార్కులు, రిటైల్‌ పార్కులు, ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, పునరుత్పాదక ఇంధన ఎగుమతి, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ వంటి రంగాలకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిందని చెప్పారు.

ఈ సమ్మిట్‌ను ప్రచారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జర్మనీ (జనవరి 20-26), జపాన్ (జనవరి 25-27), దక్షిణ కొరియా (జనవరి 30-31) , USA (ఫిబ్రవరి 6-10)లలో రోడ్‌షోలు నిర్వహిస్తుంది.

UAE, తైవాన్‌లలో కూడా రోడ్‌షోలు నిర్వహిస్తారు. అయితే తేదీలు ఇంకా నిర్ణయించలేదు.

భారతదేశంలో కూడా ఈ సమ్మిట్ ప్రచారం కోసం రోడ్ షోలు జరుగుతాయి. జనవరి 10-14 వరకు న్యూఢిల్లీలో, ఫిబ్రవరి 3న ముంబైలో రోడ్ షోలు జరిగుతాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో ఈవెంట్‌కు తేదీలు ఇంకా ఖరారు కాలేదు.

First Published:  6 Jan 2023 2:17 PM GMT
Next Story