Telugu Global
Andhra Pradesh

ఎన్నికలకు ముందే అన్నీ పెంచేస్తున్న జగన్..

ఆరోగ్యశ్రీ పరిమితి పెంచే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. పేదల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రతి ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్లలో దిశ, ఆరోగ్యశ్రీ యాప్‌ లు ఉండాలని చెప్పారు.

ఎన్నికలకు ముందే అన్నీ పెంచేస్తున్న జగన్..
X

తెలంగాణ ఎన్నికల సమయంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచుతామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ హామీ నెరవేర్చింది కాంగ్రెస్. అయితే ఏపీలో మాత్రం అలాంటి హామీలేవీ లేకుండానే సీఎం జగన్ వైద్యసేవల పరిమితిని రూ.25లక్షలకు పెంచారు. అంటే తెలంగాణలో అమలవుతున్నదానికి రెట్టింపుకంటే ఎక్కువ. ఎన్నికలకు ముందే ఈ స్థాయిలో పథకాల పరిమితి పెంచుకుంటూ పోతున్న జగన్, ఇక ఎన్నికల సమయంలో ఎలాంటి హామీలిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం మరింత సమర్థంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,513 ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో 1.4కోట్లమందికి ఆరోగ్యశ్రీ పథకం అందుబాటులో ఉంది. వైద్యం ఖర్చు వెయ్యిరూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తుంది. గరిష్టంగా ఒక్కో కుటుంబానికి ఏడాదిలో రూ.25లక్షల మేర వైద్యసాయం అందుతుంది. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఈరోజు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుని లాంఛనంగా ప్రారంభించారు సీఎం జగన్.

ఆ రెండు యాప్ లు తప్పనిసరి..

ఆరోగ్యశ్రీ పరిమితి పెంచే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. పేదల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రతి ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్లలో దిశ, ఆరోగ్యశ్రీ యాప్‌ లు ఉండాలని చెప్పారు. ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల్లో పేషెంట్‌ కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయని, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా పేషెంట్‌ వివరాలు, గతంలో అందిన వైద్య సేవల వివరాలన్నీ.. డాక్టర్లకు తెలుస్తాయని చెప్పారు జగన్. ఆరోగ్య శ్రీ సేవల గురించి అందరికీ అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స పొందిన వారికి ఇప్పటి వరకు ఆయా ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు అందించేవారు. ఇకపై మందులు ఉచితంగా డోర్‌ డెలివరీ చేయబోతున్నట్టు తెలిపారు సీఎం జగన్.

వైద్య సేవల్లో నాడు-నేడు

గత ప్రభుత్వ హయాంలో 104,108 వాహనాలు కూడా సరిగా లేవని.. ఇప్పుడు ఏకంగా ఆ వాహనాల సంఖ్యను 2200కి పెంచుకున్నామని చెప్పారు సీఎం జగన్. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.4,100 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఏడాదికి వెయ్యి కోట్లు కూడా ఖర్చు చేసేది కాదన్నారు జగన్. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5లక్షలుంటే ఇప్పుడది రూ.25లక్షలకు పెంచుకున్నామని వివరించారు.

First Published:  18 Dec 2023 9:31 AM GMT
Next Story