Telugu Global
Andhra Pradesh

ఇద్దరికీ భద్రత ఇచ్చారే..

ఒకరేమో చంద్రబాబు కేసులను విచారిస్తున్న జడ్జి వెంకట సత్య హిమబిందు, రెండో వ్యక్తి ఎవరంటే అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి. ఇద్దరికీ చెరో 4+1 గన్‌మెన్లను ప్రభుత్వం కేటాయించింది.

ఇద్దరికీ భద్రత ఇచ్చారే..
X

చంద్రబాబునాయుడు అరెస్టు, రిమాండ్ నేపథ్యంలో ఇద్దరికి ప్రభుత్వం సెక్యూరిటీ బాగా పెంచేసింది. ఒకరేమో చంద్రబాబు కేసులను విచారిస్తున్న జడ్జి వెంకట సత్య హిమబిందు, రెండో వ్యక్తి ఎవరంటే అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి. ఇద్దరికీ చెరో 4+1 గన్‌మెన్లను ప్రభుత్వం కేటాయించింది. మామూలుగా అయితే తీర్పులు చెప్పే జడ్జీలకు మామూలుగా ఎంతుండాలో అంతే సెక్యూరిటీ ఉంటుంది. అడిషినల్ అడ్వకేట్ జనరల్‌కు కూడా సాధరణ సెక్యూరిటీ మాత్రమే ఉంటుంది.

అలాంటిది ప్రత్యేకంగా ఇద్దరికీ 4+1 భద్రతను కల్పించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమొచ్చిందంటే పొన్నవోలు వాదిస్తున్నది చంద్రబాబుకు వ్యతిరేకంగా కాబట్టే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు పాత్రే కీలకమని, చంద్రబాబే కుట్రదారుడని పొన్నవోలు చాలా ధాటిగా వాదిస్తున్నారు. సీఐడీ పెట్టిన కేసులో సత్తా ఉంది కాబట్టే చంద్రబాబు తరపున దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లలో ఒకళ్ళయిన సిద్దార్థ‌ లూథ్రా ఎన్ని గంటలు వాదిస్తున్నా ఉపయోగం కనబడటంలేదు.

పొన్నవోలు ధాటికి, చూపిస్తున్న సాక్ష్యాధారాల ముందు లూథ్రా వాదనలు తేలిపోతున్నాయి. అందుకనే బెయిల్ ఇప్పించలేకపోయారు. హౌస్ కస్టడీ కూడా సాధించలేకపోయారు. దీంతో టీడీపీ మొత్తంలో పొన్నవోలు అంటే మండిపోతున్నారు. కాబట్టి ఎవరి నుండి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అనే అనుమానంతో ప్రభుత్వం పొన్నవోలుకు గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. ఇక హిమబిందుకు కూడా ఇదే త‌ర‌హాలో భద్రతను పెంచింది. దీనికి కారణం ఏమిటంటే లూథ్రా వాదనలు బాగా డొల్లతనంగా ఉండటంతో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేదు. అలాగే హౌస్ కస్టడీ పిటీషన్‌ను కూడా కొట్టేశారు.

ఎప్పుడైతే చంద్రబాబు బెయిల్ పిటీషన్‌ను హిమబిందు తిరస్కరించారో అప్పటి నుండి టీడీపీ సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ మొదలైంది. జడ్జి గురించి చాలా చీప్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తమకు తోచిన ఆరోపణలు చేసేస్తున్నారు. మరికొందరైతే జడ్జిపై తీవ్రంగా మండిపోతున్నారు. బహుశా ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వచ్చుంటుంది. చంద్రబాబు వ్యవహారం స్కిల్ స్కామ్‌తో పోయేదికాదు. ఇంకా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం విచారణ కూడా రాబోతోంది. కాబట్టే ఇద్దరికీ ప్రభుత్వం భద్రతను పెంచింది.

First Published:  13 Sep 2023 5:02 AM GMT
Next Story