Telugu Global
Andhra Pradesh

ఏపీ ఉద్యోగుల ఉద్యమం ముందుకే.. కానీ..!

ఈ నెల 21వ తేదీన సెల్‌ డౌన్ యథావిధిగా ఉంటుందన్నారు. ప్రభుత్వ యాప్‌ లు పనిచేయకుండా నిలిపివేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు.

ఏపీ ఉద్యోగుల ఉద్యమం ముందుకే.. కానీ..!
X

మార్చి 31లోగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ తీర్చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించినా ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం ప్రభుత్వానికి షాకిచ్చింది. తమ కార్యాచరణ ప్రకారం ఉద్యమం కొనసాగిస్తామన్నారు నేతలు. అయితే ముందు ప్రకటించినట్టుగా కాకుండా కాస్త శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని చెప్పారు. ఈమేరకు కార్యవర్గం తాజాగా తమ నిర్ణయాన్ని ప్రకటించింది.

ప్రభుత్వంతో చర్చలు ముగిసిన తర్వాత కాస్త శాంతించినట్టే కనిపించినా, అత్యవసర కార్యవర్గ సమావేశం అనంతరం మళ్లీ నిరసనలకే మొగ్గు చూపింది ఏపీ జేఏసీ అమరావతి. ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. మినిట్స్ కాపీలు ఇచ్చిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగించాలని అభిప్రాయపడ్డారు నేతలు. ఈరోజు నుంచి మా ఉద్యమ కార్యాచరణ మొదలైనట్టేనని చెప్పారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. తమ ఉద్యమాన్ని నిజాయితీగా కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం కొన్ని అంశాలకు సానుకూలంగా స్పందించిందని, అందుకే ఉద్యమ తీవ్రత తగ్గించి శాంతియుతంగా నిరసనలు తెలుపుతామని వెల్లడించారు నేతలు.

ఉద్యోగుల ఆవేదన చూసి అయినా ప్రభుత్వంలో మార్పు రావాలని కోరుతున్నట్టు తెలిపారు బొప్పరాజు. గతంలో చేసిన పోరాట ప్రణాళికలో చిన్న చిన్న మార్పులు చేశామని, ఈరోజు నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చే నెల 5వ తేదీ వరకు విధుల్లో పాల్గొంటామన్నారు. ఈనెల 17నుంచి అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు సందర్శించి మద్దతు కోరతామన్నారాయన. ఈ నెల 21వ తేదీన సెల్‌ డౌన్ యథావిధిగా ఉంటుందన్నారు. ప్రభుత్వ యాప్‌ లు పనిచేయకుండా నిలిపివేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. ఏప్రిల్ ఐదో తేదీన మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. . ఈ నెల రోజుల అంశాలను మరో సారి చర్చించి కార్యాచరణ ప్రకటిస్తాం అన్నారు బొప్పరాజు. సీపీఎస్ రద్దు సహా తమ సమస్యలు పూర్తిగా పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు.

First Published:  9 March 2023 11:24 AM GMT
Next Story