Telugu Global
Andhra Pradesh

మహిళా పోలీస్ విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా..?

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులను పోలీస్ శాఖలోని సాధారణ విధులకు వినియోగించడం, తరచుగా పోలీస్ స్టేషన్ కు పిలిపించడం.. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్నారు డీజీపీ.

మహిళా పోలీస్ విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా..?
X

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కీలక మార్పుల్లో సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. సచివాలయాల్లో కొత్త ఉద్యోగాలు సృష్టించి, ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి మరీ నియామకాలు చేపట్టారు. ఆ నియామకాల్లో మహిళా పోలీస్ ఉద్యోగం కూడా ఉంది. అయితే వీరికి ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షలు లేవు, యూనిఫామ్ లేదు. కానీ కాలక్రమంలో వీరికి కూడా ఖాకీ యూనిఫామ్ ఇచ్చి ఏపీ పోలీస్ విధుల్లో వినియోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొందరు మహిళా పోలీసులే దీన్ని వ్యతిరేకించారు. దీంతో వ్యవహారం కోర్టులో ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం సచివాలయ మహిళా పోలీసుల్ని డిపార్ట్ మెంట్ లో భాగంగానే వినియోగించుకుంటోంది. సడన్ గా ఈ నిర్ణయంలో మార్పులొచ్చాయి. వారిని సివిల్ డ్యూటీలకు పిలవొద్దంటూ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

సచివాలయ మహిళా పోలీసుల్ని ఇప్పటి వరకు డిపార్ట్ మెంట్ ఉద్యోగుల్లానే ప్రభుత్వం భావిస్తోంది. బందోబస్తు విధులకు విరివిగా ఉపయోగిస్తోంది. శాలరీ ఇచ్చేది సచివాలయ శాఖ అయినా, అధికారికంగా ఉద్యోగులకు ఎంపీడీవో బాస్ అని అంటున్నా.. వారు స్థానిక పోలీస్ స్టేషన్ ఆదేశాలు పాటించాల్సి వస్తోంది. అటు సచివాలయాలకు వెళ్లలేక, ఇటు సివిల్ డ్యూటీలు చేయలేక చాలామంది అవస్థలు పడుతున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది.

స్థానికంగానే వారి సేవలు..

గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఇతర శాఖలతో సమన్వయ పరుచుకుని వారికి కావల్సిన పూర్తి సహాయసహకారాలు అందించడం మహిళా పోలీసు ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశమని అంటున్నారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులను పోలీస్ శాఖలోని సాధారణ విధులకు వినియోగించడం, తరచుగా పోలీస్ స్టేషన్ కు పిలిపించడం.. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్నారు. దీనికి విరుద్ధంగా మహిళా పోలీసులను సాధారణ పోలీసు విధులకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్లు, రేంజ్ డీఐజీలు, జిల్లా ఎస్పీలను హెచ్చరిస్తూ ఆదేశాలు జారీ చేశారు డీజీపీ.

First Published:  22 July 2023 2:01 AM GMT
Next Story